టీటీడీ ఛైర్మన్ పదవి ఎవరికి దక్కబోతోందో తేల్చేసిన సాయిరెడ్డి
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారిగా అపాయింట్ అయిన ఐఆర్ఎస్ అధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి.. కొద్దిసేపటి కిందటే బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు ఆయన స్వామివారికి తలనీలాలను సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న రంగనాయకులవారి మండపంలో టీటీడీ అర్చకులకు ఆయనకు వేదాశీర్వచనాలు పలికారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శేషవస్త్రాన్ని బహూకరించారు. శ్రీవారి ఫొటో, అగరబత్తులు, గో ఉత్పత్తులను అయనకు అందజేశారు. తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరాహస్వామిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. టీటీడీ అదనపు ఈవోగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు వేలాదిగా విచ్చేస్తున్న భక్తులకు మరింత సౌకర్యవంతం, స్నేహపూరకం, పారదర్శకంగా సేవలను అందిస్తామని వెంకయ్య చౌదరి హామీ ఇచ్చారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని అన్నారు.
అదే సమయంలో- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి తెర మీదికి వచ్చారు. వెంకయ్య చౌదరి నియామకాన్ని తప్పుపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. కమ్మ సామాజిక వర్గానికే పదవులను కట్టబెట్టుతోందంటూ విమర్శించారు.
టీటీడీ అదనపు ఈవోతోపాటు అన్ని కీలక స్థానాల్లో కమ్మవారిని టీడీపీ నియమించిందంటూ ధ్వజమెత్తారు విజయసాయి రెడ్డి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని కట్టబెట్టుతుందని విమర్శించారు. ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా అదే కులానికి చెందిన వ్యక్తిని నియమించాలని చంద్రబాబు చూస్తోన్నారని చెప్పారు.

ఇతర సామాజికవర్గాల వారు కూడా ఈ పదవులకు అర్హులనే నమ్మకం చంద్రబాబుకు లేదని తేల్చి చెప్పారు సాయిరెడ్డి. చంద్రబబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మాయమౌతాయని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. పగ్గాలు అందినప్పుడు ఇంకో మాట మాట్లాడటం ఆయనకు అలవాటేనని చురకలు అంటించారు.
ఇప్పుడు కూడా తనకు అలవాటైన రీతిలో ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వాగ్దానాలకు తూట్లు పొడుస్తూ తన మీద, తన కుటుంబం మీద, తన కులం మీద, డబ్బు మీద దృష్టి సారించారని, వాగ్దానాలను అమలు చేసే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications