టీడీపీకి భారీగా రాజీనామాలు.. ఆ వైసీపీ మాజీ నేత వల్లే..?
టీడీపీలో అంతర్గత పోరు మొదలైందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా ఓ మాజీ వైసీపీ నేత తీరుపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఎమ్మెల్యేగా మిగిలిపోయారు కొలుసు పార్థసారథి. పార్టీ అధినేత జగన్ పెనమలూరు సీటు ఇవ్వడానికి నిరాకరించారనే కారణంతో ఆయన వైసీపీని వీడారు. టీడీపీలో కూడా ఆయనకు పెనమలూరు సీటు దక్కలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్థసారథికి నూజవీడు సీటును కేటాయించారు.
టీడీపీ-జనసేన హవాలో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో, పార్థసారథికి బీసీ కోటాలో మంత్రి పదవి దక్కింది. అయితే తాజాగా మంత్రి కొలుసు పార్థసారథి తీరుపై టీడీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. టీడీపీకి చెందిన వారి పట్టాదారు పాసుపుస్తకాలను రద్దు చేసి వైసీపీ నేతలకు కట్టబెట్టారని మంత్రిపై విమర్శలు వినిపిస్తున్నాయి.దీంతో పాటు వైసీపీ నేతకు సహకార బ్యాంకు చైర్మన్ పదవిని ఇవ్వడం టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. తిరువూరు, నూజివీడుతోపాటు కీలకమైన గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలకు అనుకూలంగా మంత్రి వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

దీంతో తెలుగు తమ్ముళ్లతో పాటు , నేతలు కూడా మంత్రిపై అసంతృప్తితో కొనసాగుతున్నారు. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కంటే టీడీపీలో ఉన్నప్పుడే తమకు అన్యాయం జరుగుతుందని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు.తాజాగా ఏలూరు జిల్లా చాట్రాయిమండలం నరసింహరాయుని పేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు మంత్రి పార్థసారథి తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదనతో పార్టీకి రాజీనామా చేశారు. ఆ గ్రామంలో 40 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్నవారిని కాదని, ఇటీవల వైసీపీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని సీనియర్ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.దాదాపు 500 మంది పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.మంత్రిని కంట్రోల్ చేయకపోతే పలు నియోజకవర్గాల్లో పార్టీ నాశనం కావడం ఖాయమంటూ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. మరి మంత్రిపై టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications