బీజేపీతో పొత్తు వేళ చంద్రబాబు కీలక నిర్ణయం - "లెక్క" మార్చేనా..!!
ఏపీలో పొత్తుల అంశం కీలక దశకు చేరుకుంది. టీడీపీ, జనసేన ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్లే వ్యూహంలో మరో అడుగు పడింది. ఈ రోజు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమయంలో బీజేపీ నుంచి సీట్ల అంశంలో భారీగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో చంద్రబాబు పార్టీ సీనియర్లతో సమావేశం అయ్యారు. పార్టీకి మేలు అయితేనే పొత్తు ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
పొత్తులు లెక్కలు : ఏపీలో ఎన్నికల వేళ పొత్తుల అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశ సమయంలో పొత్తులో కీలకమైన సీట్ల సర్దుబాటు గురించి చర్చకు రానుంది. దీంతో ముందుగా సీట్ల కేటాయింపు పైన పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు మంతనాలు చేసారు. 2009లో బీజేపీకి ఎక్కువ సీట్లు కేటాయించి నష్టపోయిన అంశాన్ని పార్టీ ముఖ్యులు చంద్రబాబుకు గుర్తు చేసారు. ఇప్పటికే జనసేనతో పొత్తు కారణంగా దాదాపు 25-30 సీట్లు కోల్పోతున్నామని..బీజేపీ కోరిన విధంగా పెద్ద సంఖ్యలో సీట్లు ఇస్తే పార్టీలో నేతల్లో వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. బీజేపీకి 3 ఎంపీ, 10 అసెంబ్లీకి పరిమితం కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

చంద్రబాబు మంతనాలు : అటు బీజేపీ మాత్ర 6-8 ఎంపీ స్థానాలు, 25 వరకు అసెంబ్లీ ఇవ్వాలని కోరుతోంది. దీని పైనే ఈ రోజు ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ దేశ వ్యాప్తంగా 400 సీట్లు సాధించాలనే లక్ష్యం తో పని చేస్తుంది. పార్లమెంట్ లో ప్రధాని మోదీ సైతం బీజేపీకి 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిపి 400 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు. అందులో భాగంగా దక్షిణాదిన జేడీఎస్, టీడీపీ, జనసేనతో పొత్తుతో వెళ్లాలనే ఆలోచనలో ఉంది. ఎమ్మెల్యే స్థానాలు తగ్గినా.. ఎంపీ స్థానాలు 6-8 ఇవ్వాలని బీజేపీ తాజాగా ప్రతిపాదన చేసినట్లు సమాచారం. టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సీఎం రమేష్ ఇదే అంశం పైన అమిత్ షా తో వరుస మంతనాలు చేసారు.

బీజేపీకి ఇచ్చే సీట్లెన్ని : ఇక, ఇప్పుడు చంద్రబాబు ఈ భేటీలో అమిత్ షా నుంచి వచ్చే ప్రతిపాదన పైన ఎలా స్పందిస్తారనేది పొత్తులో కీలకం కానుంది. బీజేపీ తమ ప్రతిపాదనలో కీలక స్థానాలను ప్రస్తావించింది. ఈ స్థానాలను వదులుకుంటే భవిష్యత్ లో పార్టీ నష్టపోతుందనే అభిప్రాయం సీనియర్లు వ్యక్తం చేసారు. ఈ వాదనతో చంద్రబాబు ఏకీభవించారు. ఇదే సమయంలో బీజేపీతో పొత్తు కొన్ని వర్గాలను పార్టీకి దూరం చేస్తుందనే వాదన ఈ చర్చల సమయంలో ప్రస్తావనకు వచ్చింది. అయితే, ఎన్నికల సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతు అవసరమని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. బీజేపీతో పొత్తుకు 10 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్దమైనట్లు తెలుస్తోంది. దీంతో..ఇందుకు బీజేపీ సిద్దమేనా..పొత్తు ఖాయం అవుతుందా లేదా అనే ఉత్కంఠ మొదలైంది.












Click it and Unblock the Notifications