Vijayawada politics:టీడీపీలో చంద్రబాబు మార్క్ మార్పులు -నేతల్లో ఉత్కంఠ..!!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికలను టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తోంది. సీఎం జగన్ మరోసారి అధికారం ఖాయమనే ధీమాతో అడుగులు వేస్తున్నారు. పొత్తులతో పాటుగా పార్టీలోనూ అవసరమైన మార్పుల దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పార్టీ నేతల్లో ఉత్కంఠకు కారణమం అవుతోంది.
కొత్త అధ్యక్షుల నియామకం : టీడీపీ ఉమ్మడి కృష్ణాజిల్లాలో తిరిగి పట్టు సాధించాలనే ప్రయత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికల్లో కృష్ణాజిల్లాలో టీడీపీకి రెండు సీట్లు మాత్రమే దక్కాయి. ఈ సారి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పైన ఇప్పటికే ఫోకస్ చసిన చంద్రబాబు.. పార్టీ పరంగానూ అవసరమైన మార్పుల దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాఅధ్యక్షుడిగా మాజీ మంత్రి నెట్టం రఘురాం వ్యవహరిస్తున్నారు.సౌమ్యుడిగా..సీనియర్‌గా పేరున్నా ఎన్నికల వేళ పార్టీని నడిపే క్రమంలో మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారనే అభిప్రాయం ఉంది. ఎన్నికల వేళ పార్టీలో గ్రూపులు పెరుగుతున్నా.. రఘురాం మెతక వైఖరి కారణంగా ఎన్నికల వేళ నష్టం జరిగే అవకాశం ఉందని పార్టీ భావిస్తోంది. అదే సమయంలో పార్టీ కార్యక్రమాలు నామ్ కే వాస్తేగా అన్నట్లుగా మారాయి. దీంతో, అధ్యక్ష మార్పు ఖాయమని తెలుస్తోంది.

చంద్రబాబు కసరత్తు : ఇప్పటికే విజయవాడ నగర పార్టీ రాజకీయాలపైన నాయకత్వం ఆగ్రహంగా ఉంది. ఎంపీ కేశినేని తీరు పైన పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. విజయవాడ లోక్ సభ బరిలో ఎన్నికల సామాజిక సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ ఏ వర్గానికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు కేటాయిస్తుందనే చర్చ సాగుతోంది. బీసీ వర్గానికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బీసీ వర్గానికి ఇస్తే బుద్దా వెంకన్నకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కమ్మ వర్గానికి ఇవ్వాలని నిర్ణయిస్తే కేశినేని చిన్నికి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా నారా లోకేశ్ యువగళం సమయంలోనూ చిన్ని క్రియాశీలకంగా వ్యవహరించారు. జిల్లా నేతలతో సత్సంబంధాలు చిన్నికి కలిసి వచ్చే అంశం. ఇదే సమయంలో విజయవాడ లోక్ సభ రేసులో కూడా చిన్ని ఉన్నట్లుగా చెబుతున్నారు.
నేతల్లో ఉత్కంఠ : అధికార వైసీపీ పైన విరుచుకుపడే బుద్దా వెంకన్నకు అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. వైసీపీ ముఖ్య నేతల పైన వెంకన్న దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ పైన వైసీపీ నుంచి ఎటువంటి ఆరోపణలు వచ్చినా గట్టిగా బదులిస్తున్నారు. ఇదే సమయంలో విజయవాడ నగర రాజకీయాల్లోనూ టీడీపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. జిల్లాలో జనసేనతో పొత్తులు..సీట్ల ఖరారు పైన ఇప్పటికే చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో మరిన్ని కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు చంద్రబాబు సిద్దం అవుతున్నారనే సమాచారంతో నేతల్లో ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications