చంద్రబాబుదే ఆ రికార్డు, ఇటు జగన్ - 2024 ఫలితం ఇదేనా..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తరువాత పొత్తుల లెక్కలు అధికారికం అయ్యాయి. జగన్ ఓటమి లక్ష్యంగా రెండు పార్టీలు ముందుకొచ్చాయి. ఇటు సీఎం జగన్ ఎన్నిక ల సమరశంఖం పూరించారు. వరుస కార్యక్రమాలు ప్రకటించారు. ఇటు చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సమయంలోనే చంద్రబాబు రాజకీయ రికార్డులు చర్చకు వస్తున్నాయి. 2024 ఎన్నికల ఫలితాల పైన కొత్త అంచనాలు మొదలయ్యాయి.
45 ఏళ్ల రాజకీయ అనుభవంతో: చంద్రబాబుది సుదీర్ఘ రాజకీయ అనుభవం. వైశ్రాయ్ ఎపిసోడ్ తరువాత 1995లో సెప్టెంబర్ 1న చంద్రబాబు ఏపీ ఉమ్మడి రాష్ట్ర సీఎం అయ్యారు. కాంగ్రెస్ లో మంత్రిగా పని చేసి..టీడీపీలో చేరిన నాటి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారనే ఆరోపణలు ఇప్పటికీ తప్పటం లేదు. 1983 లో టీడీపీ స్థాపించిన తరువాత 9 నెలలకే జరిగిన ఎన్నికల్లో 202 సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో 1985లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచింది. వరుసగా రెండు ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన చరిత్ర ఎన్టీఆర్ సొంతం.
అధికారానికి దూరంగా: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఎన్నికల్లో 1999 సెప్టెంబర్ లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తిరిగి 181 సీట్లతో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిలో ఉండగా గెలిచిన ఏకైక ఎన్నిక అది మాత్రమే. 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు పరాజయం పాలయ్యారు. వైఎస్సార్ సీఎం అయ్యారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో మహా కూటమితో నాడు వైఎస్సార్ ను ఓడించే ప్రయత్నం చేసారు. కానీ, వైఎస్సార్ సింగిల్ గా పోటీ చేసి కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తెచ్చారు.
ఇలా వరుసగా పదేళ్ల పాటు చంద్రబాబు అధికారానికి దూరమయ్యారు. పదేళ్ల తరువాత రాష్ట్ర విభజన తరువాతి పరిస్థితుల్లో బీజేపీ, జనసేనతో కలిసి చంద్రబాబు విభజించిన ఏపీ సీఎం అయ్యారు. 2019 వరకు పదవిలో కొనసాగారు. ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ పరాజయం పాలైంది. 151 సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చారు.
హిస్టరీ రిపీట్ అయ్యేనా: చంద్రబాబు 2004 నుంచి 2014 వరకు అధికారానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు 2019 నుంచి దూరంగా ఉండాల్సి వచ్చింది. 2024లో తిరిగి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ, సర్వ నివేదికలు ఇప్పటి వరకు వస్తున్నవి వైసీసీకి అనుకూలంగా ఉంటున్నాయి. జగన్ ను ఓడించాలంటే పవన్ తో పొత్తు తప్పనిసరి అయింది. బీజేపీ నిర్ణయం పైన స్పష్టత లేదు. ఇప్పుడు ఊహించని విధంగా చంద్రబాబు కేసుల్లో చిక్కుకొని రిమాండ్ లో ఉన్నారు.
సంక్షేమం తనకు అధికారం నిలబెడుతుందనే నమ్మకంతో జగన్ ఉన్నారు. పవన్ కు మాస్ ఫాలోయింగ్ ఉన్నా..ఎలక్షనీరింగ్ లో అనుభవం లేదు. జగన్ సోషల్ ఇంజనీరింగ్ సామర్ధ్యం ఏంటో 2019 ఎన్నికల్లో చాటారు. ప్రస్తుత పరిణామాలు..పదేళ్లు అధికారానికి దూరంగా ఉండటం పరిపాటిగా మారిన సమయంలో..2024 ఎన్నికల్లోనూ టీడీపీకి పరాజయం తప్పదా అనే చర్చ మొదలైంది. దీంతో, తాజా పరిణామాలు.. సర్వేలు...సమీకరణాలు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయనే విశ్లేషణలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications