టీడీపీతో కలిసేందుకు బీజేపీ సిద్దమేనా , కండీషన్స్ అప్లై- ఢిల్లీ మీట్ లో ఏం తేల్చారు..!!
తెలుగుదేశం పార్టీతో బీజేపీ మళ్లీ జట్టు కట్టనుందా. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా..బీజేపీ చీఫ్ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. నాలుగేళ్ల తరువాత అమిత్ షా ను కలిసిన చంద్రబాబు పలు అంశాలపైన చర్చలు చేసినట్లు తెలుస్తోంది. అందులో పొత్తులు ప్రధాన అంశంగా ఉంది. పొత్తుల కారణంగా రెండు పార్టీలకు కలిగే ప్రయోజనాలకు చంద్రబాబు వివరించారని సమాచారం. రెండు రాష్ట్రాల్లో పరస్పరం సహకరించుకోవాలని చంద్రబాబు ప్రతిపాదించారు. అమిత్ షా మాత్రం తెలంగాణ పైనే ఎక్కువగా ఆరా తీసినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు కీలక మంతనాలు : ఏపీలో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు లక్ష్యం. ఇందుకోసం నవ్ ఆర్ నెవర్ గా ఎన్నికలకు కేడర్ కు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పవన్ కల్యాణ్ తో పొత్తు ఖరారు చేసుకున్నారు.

పవన్ ద్వారా బీజేపీ ముఖ్య నేతల వద్ద 2014 తరహాలో పొత్తు ల పైన ప్రతిపాదనలు చేసారు. ఇప్పుడు నేరుగా అమిత్ షా..బీజేపీ చీఫ్ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు పార్టీల మధ్య రెండు రాష్ట్రాల్లోనూ పరస్పర సహకారం..ప్రయోజనాలకు చంద్రబాబు సమగ్రంగా వివరించినట్లు తెలుస్తోంది. తెలంగాణ పైన షా ఎక్కవగా ప్రస్తావన చేసినట్లు తెలుస్తోంది. టీడీపీతో జత కడితే అసలు బీజేపీకి ఓట్లు పెరుగుతాయా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది.
పొత్తులతో లాభ నష్టాలు : తెలంగాణలో టీడీపీతో పొత్తుకు ఆ రాష్ట్ర బీజేపీ నేతలు సముఖుంగా లేరు. గతంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు కారణంగా నష్టపోయిందని పార్టీ నాయకత్వానికి నివేదించారు. ముందుగా బీజేపీకి తెలంగాణ లో తాను మద్దతుగా నిలిచి..ఏపీలో బీజేపీ సహకారం తీసుకోవాలనేది చంద్రబాబు లక్ష్యం. దీంతో, ఈ సమావేశంలో తెలంగాణలో తమ ప్రభావం..అంచనాలను వివరించినట్లు తెలుస్తోంది.
ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను వివరించారలని సమాచారం. 2018 నాటి పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో లేవని..బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తరువాత టీడీపీని ప్రాంతీయ పార్టీగా చెప్పే అవకాశం లేదనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయిందని చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ సహకారం తీసుకోవాలంటే ఏపీలో కూడా బీజేపీ స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏపీలో సీఎం జగన్ తో బీజేపీ అగ్రనాయకత్వం సానుకూలంగా ఉండటంతో ఏపీ పొత్తుల పైన ప్రతిపాదనే కానీ, నిర్ణయం రాలేదని విశ్వసనీయ సమాచారం.

ఏపీ పర్యటనలో క్లారిటీ : ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ మూడ్ తెలుసుకొనేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అదే సమయంలో చంద్రబాబు ప్రతిపాదన ఏంటి..ఇవి తమ పార్టీకి నిజంగా మేలు చేస్తుందా అనే కోణంలో బీజేపీ నేతలు వివరాలు సేకరించిన్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనల పైన భవిష్యత్ లోనూ చర్చలు జరుగుతాయని..ఆ తరువాతనే రెండు రాష్ట్రాల్లో పొత్తులపై తుది నిర్ణయానికి వస్తారని చెబుతున్నారు. రెండు పార్టీల రాజకీయ పరస్పర ప్రయోజనాల ఆధారంగానే తుది నిర్ణయం జరిగనుంది.
చంద్రబాబు చేసిన ప్రతిపాదన పైన అమిత్ షా..ప్రధాని మోదీతో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 8న అమిత్ షా విశాఖకు రానున్నారు. 10న నడ్డా తిరుపతి రానున్నారు. ఆ సమయంలో జనసేనాని పవన్ తోనూ భేటీ అవుతారని సమాచారం. పొత్తుతో తమకు లాభ నష్టాలు బేరీజు వేసుకున్న తరువాత బీజేపీ తదుపరి అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నిర్ణయం ఆధారంగా టీడీపీ, జనసేన నిర్ణయాలు ఉండనున్నాయి.












Click it and Unblock the Notifications