పవన్ కల్యాణ్ పొత్తుల వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు..!!
ఏపీలో టీడీపీ - జనసేన పొత్తు ఇక లాంఛనమే. పవన్ కల్యాణ్ శ్రీకాకుళం నుంచి పొత్తుల పైన తాను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పేసారు. తమ గౌరవం కాపాడుకుంటూనే పొత్తులతో వెళ్తామని తేల్చి చెప్పారు. అదే సమయంలో గౌరవం దక్కకుంటే ఒంటరి పోరు తప్పదని స్పస్టం చేసారు. ఇదే అంశం పైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. పవన్ కల్యాణ్ తన మీటింగ్ లో చెప్పాలనకున్నది స్పష్టంగా చెప్పారంటూ చంద్రబాబు సర్టిఫై చేసారు. పవన్ ను వైసీపీ నేతలు ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. అంత భయం ఎందుకని నిలదీసారు. వైసీపీ నేతల్లో ఎందుకు ఆ పిరికితనమంటూ చంద్రబాబు ఎద్దేవా చేసారు.
సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు చంద్రబాబు నారావారిపల్లికు వచ్చారు. తాజా రాజకీయాలపైన స్పందించారు. అధికారం ఉందనే అహంకారం మంచిది కాదన్నారు. ప్రజలు అన్ని రకాలుగా రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నారని.. వారే బుద్ద చెబుతారని వ్యాఖ్యానించారు.

అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. సేవాభావం ఉన్న వ్యక్తులే రాజకీయాల్లో ఉండాలని అభిప్రాయ పడ్డారు. తప్పు చేస్తూ ఎదురదాడి ద్వారా కప్పి పుచ్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేసులకు భయపడే పరిస్థితి లేదని, కార్యకర్తలు తెగించి రోడ్డుపైకి వస్తున్నారని చంద్రబాబు వివరించారు. ప్రభుత్వం వారిని జైలులో పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తే లొంగిపోరని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 పైనా చంద్రబాబు స్పందించారు. ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టకూడదా అని ప్రశ్నించారు. దీని కోసమే ఆ జీవో తెచ్చారని చెప్పారు. వైసీపీ మాత్రం మీటింగ్ లు పెట్టుకోవచ్చా అని నిలదీసారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తన పోరాటం ఆగదని చంద్రబాబు స్పష్టం చేసారు.

రాష్ట్రాన్ని కాపాడుకుంటానని విశ్వాసం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో వ్యవస్థలు అన్నింటనీ నాశనం చేసారని మండిపడ్డారు. కోట్ల రూపాయాలు విధ్వంసానికి దుర్వినియోగం చేసారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. రెండు రోజులు నారా - నందమూరి కుటుంబాలు నారావారిపల్లిలోనే సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications