టీడీపీ తుది జాబితా సిద్దం, అనూహ్య ఎంపిక - ఎవరెక్కడ..!!
తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తుది జాబితా పై స్పస్టత వచ్చింది. పొత్తుల్లో భాగంగా జనసేనకు, బీజేపీకి కేటాయించిన అభ్యర్థులను ప్రకటించడంతో ఇక టీడీపీ ఎక్కడెక్కడ పోటీ చేసేది క్లారిటీ వచ్చింది. టీడీపీ తొలి జాబితాలో ప్రకటించిన మూడు స్థానాలను మిత్రపక్షాలకు సర్దుబాటు చేయడంతో పెండింగ్ 5 అసెంబ్లీ స్థానాలు కలిపి మొత్తం 8 మంది అసెంబ్లీ అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. తుది జాబితాలో గంటా, కళా వెంకట్రావు లాంటి వారి సీట్ల పై స్పష్టత రానుంది.
అభ్యర్థుల జాబితా
పొత్తుల లెక్కల తరువాత టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ సీట్లలో పోటీ చేయనుంది. రెండు జాబితాలు విడుదల చేసిన టీడీపీ 8 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్దం అవుతోంది. చంద్రబాబు కసరత్తు పూర్తి చేసారు. మిత్రపక్షాలైన బీజేపీ 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లోనూ, జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. బీజేపీతో పొత్తు అనంతరం మూడు సీట్లు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అరకు అసెంబ్లీ స్థానానికి దొన్నుదొరను, పి. గన్నవరంలో మహాసేన రాజేష్, అనపర్తిలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థులుగా ఇంతకుముందే టీడీపీ ప్రకటించింది.

అనూహ్య ఎంపిక
టిడిపి ప్రకటించాల్సిన స్థానాల్లో ఇప్పుడు చీపురుపల్లి, భీమిలి నియోజకవర్గం మారింది. చీపురుపల్లి స్థానంలో మాజీ మంత్రి గంటను పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు సూచించారు. గంట మాత్రం భీమిలి స్థానం దక్కించుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. గంట చీపురుపల్లికి వెళ్లక పోతే అక్కడ సీనియర్ నేత కళా వెంకట్రావు, కిమిడి నాగార్జున లో ఒకరికి ఛాన్స్ కనిపిస్తుంది. గంట చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైతే భీమిలి స్థానం కళా వెంకట్రావు లేదా బంగారు రాజుకు ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. గంటా మాత్రం తనకు భీమిలి సీటు దక్కుతుందని ధీమాతో కనిపిస్తున్నారు. ఈ రెండు సీట్లలోనే చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది.
గంటాకు దక్కేనా
విజయనగరం ఎంపీ సీటు తూర్పు కాపు వర్గానికి ఇచ్చే అవకాశం ఉంది కళా వెంకట్రావు, మీసాల గీత, నాగార్జునల్లో ఒకరికి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఒంగోలు లోక్సభ స్థానం మాగుంట శ్రీనివాస్ రెడ్డికి దాదాపు ఖరారైంది. కడప ఎంపీగా రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి లేదా భూపేష్ రెడ్డిలో ఒకరికి అవకాశం దక్కనుంది. అనంతపురం ఎంపీగా జెసి పవన్ రెడ్డి తో పాటు పూల నాగరాజు, కంబోరి నాగరాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దర్శి అసెంబ్లీ స్థానానికి గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు శ్రీలక్ష్మి పేరు పరిశీలనలో ఉంది. దీంతో పెండింగ్ ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో చంద్రబాబు తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది పార్టీలో ఉత్కంఠ పెంచుతుంది.












Click it and Unblock the Notifications