నేటి నుంచి ప్రజల మధ్యకు చంద్రబాబు - సుప్రీంలో నేడే కీలక విచారణ..!!
టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి ప్రజల మధ్యకు వస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు 53 రోజులు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. బెయిల్ వచ్చినా..అనారోగ్య కారణాలతో విశ్రాంతి తీసుకున్నారు. ఇక, ఎన్నికలకు సిద్దం అవుతన్న వేళ చంద్రబాబు తిరిగి ప్రజల్లోకి వస్తున్నారు. చంద్రబాబు రెండు రోజుల పాటుగా మిచౌంగ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు సిద్దమయ్యారు. అటు చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని సీఐడీ పిటీషన్ పై నేడు సుప్రీంలో విచారణ జరగనుంది.
చంద్రబాబు పర్యటన: ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తుఫాను ప్రభావిత ప్రారంతాల్లో పర్యటించనున్నారు. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు బాబు పర్యటన కొనసాగనుంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ అధినేత పర్యటించనున్నారు. రేపు వేమూరు, తెనాలి, బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్న చంద్రబాబు రాత్రికి బాపట్లలోనే బస చేయనున్నారు.

శనివారం పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో బాబు పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా తుపాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడంతో పాటు రైతులను నేరుగా కలుసుకోనున్నారు. రైతులను పరామర్శించి వారికి చంద్రబాబు ధైర్యం చెప్పనున్నారు. మూడు నెలల తరువాత చంద్రబాబు ప్రజల మధ్యకు వస్తుండటంతో ఆసక్తి కొనసాగుతోంది.
సుప్రీంలో బెయిల్ రద్దు విచారణ: చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీఐడీ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పైన ఈ రోజున సుప్రీంలో విచారణ జరగనుంది. గతంలో విచారణ సమయంలో ఇరుపక్షాలు స్కిల్ కేసు గురించి ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది.
హైకోర్టులో బెయిల్ మంజూరు చేయటం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఐడీ తరపున ముఖుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. దీంతో...సుప్రీం ఏ నిర్ణయం వెలువరిస్తుందనేది ఆసక్తిగా మారుతోంది. ఇదే సమయంలో స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన విచారణ పూర్తయింది. తీర్పు కోసం రిజర్వ్ అయింది. ఆ తీర్పు ఇప్పుడు చంద్రబాబు కేసులకు కీలకం కానుంది.

ఎన్నికలకు సమాయత్తం: ఏపీలో మరో మూడు నెలల కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు పార్టీని సిద్దం చేసే క్రమంలో భాగంగా చంద్రబాబు ఇక ప్రజల మధ్యనే ఉండాలని నిర్ణయించారు. ఏపీలో టీడీపీ - జనసేన పొత్తు ఖరారు కావటంతో చంద్రబాబు - పవన్ ఇద్దరూ భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించారు. ఈ నెల 17న లోకేశ్ యువగళం యాత్ర ముగింపు సభలో ఇద్దరు నేతలు పాల్గొననున్నారు.
ఇక..వరుసగా జిల్లాల్లోనూ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఇద్దరూ హాజరు కావాలని డిసైడ్ అయ్యారు. సీట్ల విషయంలోనూ ఇద్దరు నేతల మధ్య ప్రాధమికంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్న ఈ ఇద్దరు నేతలు..బీజేపీ నిర్ణయం పై క్లారిటీ వచ్చిన తరువాత ఉమ్మడి మేనిఫెస్టో - సీట్ల ఖరారుకు సిద్దమయ్యారు.












Click it and Unblock the Notifications