ఆ ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబును మెచ్చుకోవచ్చు!!
వచ్చే ఎన్నికలను వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2024 ఎన్నికలు రెండు పార్టీలకు జీవన్మరణ సమస్య లాంటివి. విజయం సాధించడానికి ఇరుపార్టీల నేతలు వ్యూహ రచన చేస్తున్నారు. అమరావతి ఏకైక రాజధాని అని, దాని అభివృద్ధికే తాము కట్టుబడి ఉన్నామని టీడీపీ చెబుతుండగా, మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని, అభివృద్ధి వికేంద్రీకరణే తమ లక్ష్యమని వైసీపీ చెబుతోంది.

నాయకులంతా అమరావతి మాటమీదే..!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయంపై అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర నాయకులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు అమరావతికే మద్దతు పలుకుతున్నారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు గతంలో చేసిన, ఇప్పుడు చేస్తున్న (తాత్కాలికంగా వాయిదా పడింది) పాదయాత్ర వెనక తెలుగుదేశం ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవం.

పార్టీలోని క్రమశిక్షణకు దర్పణం!
రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు తమ తమ ప్రాంతాలకు రాజధానిని తీసుకురావాలంటూ ఆందోళన బాట పట్టారు. అమరావతికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎక్కడ కార్యక్రమం జరిగినా ఆయా ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం అమరావతికే కట్టుబడి నిలిచారు. వారంతా అమరావతే రాజధాని అని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయం ఆ పార్టీ నాయకుల తీరును, పార్టీలో నెలకొన్న క్రమశిక్షణను తెలియజేస్తోందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 స్థానాలనే గెలుచుకోగలిగింది.

అమరావతికి దగ్గరగా ఉండేవారే పార్టీని వీడారు!
పార్టీని వీడినవారిలో కోస్తా ప్రాంతానికి చెందినవారే ఉన్నారు. గుంటూరు పశ్చిమ (మద్దాలి గిరి), గన్నవరం (వల్లభనేని వంశీ), కరణం బలరాం (చీరాల)తోపాటు విశాఖకు చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. వీరంతా వైసీపీకి అనుబంధ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వీరంతా అమరావతికి దగ్గరగా ఉండేవారే. ఇతరులెవరూ టీడీపీ గడప దాటలేదు. రాజకీయం అత్యంత సంక్లిష్టంగా మారిన తరుణంలో చంద్రబాబు సాధించిన విజయమని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తెలుగు తమ్ముళ్లు అమరావతి మాటమీదే ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ప్రజల నుంచి మూడు రాజధానులకు అనుకూలంగా ఎటువంటి డిమాండ్లు లేకపోవడం కూడా వీరిపై భారం దించినట్లవుతోంది. అందుకే చంద్రబాబునాయుడును పార్టీ క్రమశిక్షణ విషయంలో మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నామని సీనియర్ రాజకీయవేత్తలు అంటున్నారు.












Click it and Unblock the Notifications