70 నియోజకవర్గాల్లో టికెట్లు వారికే ఖరారు చేసిన చంద్రబాబు, లోకేష్?
తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికలు అత్యంత క్లిష్టమైనవి. ఒకవైపు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టాలి. అందుకు ఆర్థికబలం, అంగబలం ఉన్న అభ్యర్థులు కావాలి. మరోవైపు కేంద్రం నుంచి ఎటువంటి సహకారం అందడంలేదు. ఈసారి ఎన్నికల్లో సహకరించకపోయినా పర్వాలేదు.. తటస్థంగా ఉంటే చాలని చంద్రబాబు కోరుతున్నారు. ఇంకోవైపు జనసేనాని పవన్‌కల్యాణ్ తన మార్గాన్ని స్పష్టం చేస్తున్నారు. ప్రసంగాల్లో పొత్తుల గురించి మాట్లాడటంలేదు. జనసేనను గెలిపించాలని మాత్రమే ప్రజలను కోరుతున్నారు.

వరుసగా మూడుసార్లు ఓటమిపాలైనవారికి సీట్లు లేవు
తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఓటమి పాలైనవారికి టికెట్లు లేవని ఖరాఖండిగా తేల్చేసింది. అందుకనుగుణంగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తోంది. యువతకు టికెట్లు ఇవ్వాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్ణయించినట్లుగా టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అందులో ఎక్కువ భాగం సీనియర్ నేతల వారసులకు కేటాయిస్తున్నారు. అంతేకాకుండా మొత్తం 175 నియోజకవర్గాల్లో 70 నియోజకవర్గాలను పూర్తిగా యువతకే కేటాయింబోతున్నారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో నారా లోకేష్ ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. యువతకు సీటు కేటాయించడంద్వారా విజయావకాశాలు మెరుగుపడతాయనేది తెలుగుదేశం పార్టీ ఆలోచనగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ కూడా ఇదే మంత్రాన్ని పఠించింది.

మహానాడులో లోకేష్ పై ఒత్తిడి
మహానాడు జరిగిన సమయంలోను పలువురు యువనేతలు ఆయా నియోజకవర్గాల్లో తమకే సీటు కేటాయించాలంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు ఎటువంటి హామీని లోకేష్ ఇవ్వలేదు. దూకుడుగా రాజకీయం చేయడంతోపాటు పదునైన మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్న లోకేష్ చంద్రబాబు తర్వాత పార్టీ పగ్గాలు అందుకోబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

యువ తంత్రం.. గెలుపు మంత్రం
2019 ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత లోకేష్ ప్రత్యర్థులపై పదునైనా అస్త్రాలను సంధిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఓటమిపాలైనప్పటికీ తిరిగి అక్కడినుంచే పోటీచేసి విజయం సాధించబోతున్నానని చెబుతూ పార్టీ నేతల్లో ఆత్మవిశ్వసాన్ని కలిగిస్తున్నారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబుతో చర్చించి తీసుకుంటుండంతో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావడంలేదని భావిస్తున్నారు. సీనియర్లకు, తనకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వయసు రీత్యా వస్తోందని, అందుకే తన వయసున్నవారికే పార్టీలో ప్రాధాన్యం కల్పించాలని, సీట్లు కేటాయించాలని నిర్ణయించుకోవడం మంచి పరిణామంగానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. తాజగా తెలుగుదేశం పార్టీ పఠిస్తున్న యువ మంత్రం రాబోయే ఎన్నికల్లో ఎంతవరకు ఆ పార్టీని గట్టెక్కిస్తుందో తెలుసుకోవాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.!!












Click it and Unblock the Notifications