Araku Coffee: కాఫీ ఎలా ఉంది భువనేశ్వరీ.. చంద్రబాబు ట్వీట్...!
ఏపీలో గతంలో చంద్రబాబు అరెస్టు సందర్భంగా కలత చెంది ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన భార్య భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో యాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ అరకు వెళ్లిన ఆమె.. అక్కడ గత టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన అరకు కాఫీ షాప్ ను సందర్శించారు. అరకు సెంటర్లోని అరకు గోల్డ్ కాఫీ సెంటర్ వద్ద స్ధానికంగా పండించిన గింజలతో తయారైన కాఫీ తాగిన భువనేశ్వరి... ఆ తర్వాత నిజం గెలవాలి యాత్రకు వెళ్లారు.
ఈ సందర్భంగా అరకు కాఫీ గొప్పతనాన్ని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దొన్నుదొర భువనేశ్వరికి వివరించారు. చంద్రబాబు పాలనలో కాఫీ తోటలను ప్రత్యేకంగా ప్రోత్సహించారని భువనేశ్వరికి తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాఫీ తోటల పెంపకాన్ని గాలికొదిలేశారని తెలిపారు. అరకు పర్యాటక ప్రదేశాన్ని కూడా జగన్ సర్కార్ పట్టించుకోవడంలేదని భువనేశ్వరికి చెప్పారు. అనంతరం అరకు ప్రకృతి అందాలను, ఆహ్లాదకరమైన ప్రదేశాలను భువనేశ్వరి పరిశీలించారు..

టీడీపీ పాలనలో అరకు ప్రాంతాన్ని, కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు మరింత చొరవ తీసుకోవాలని చంద్రబాబుకు వివరిస్తామని దొన్నుదొరకు భువనేశ్వరి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం బయలుదేరి వెళ్లిపోయారు. అయితే అరకు కాఫీ షాపులో భువనేశ్వరి కాఫీ తాగడంపై సోషల్ మీడియాలో చంద్రబాబు స్పందించారు.

అరకు కాఫీ ఎలా ఉంది భువనేశ్వరీ అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. అరకు పర్యటనలో భువనేశ్వరి అరకు కాఫీ తాగుతున్న ఫోటో పెట్టి ఎక్స్ లో పోస్టు చేశారు. మన గిరిజన సోదరులు పండించే అరకు రుచి ఎలా ఉందో చెప్పు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. దీనికి భువనేశ్వరి స్పందిస్తూ నచ్చిందండీ.. మన కిచెన్ లో అరకు కాఫీ ప్యాకెట్లు ఉన్నప్పటికీ అరకు అందాలు, ఇక్కడి ప్రజల ప్రేమతో మరింత రుచిగా మారిందన్నారు. మీరు గ్లోబల్ బ్రాండ్ గా దీన్ని మార్చినందుకు గర్వపడుతున్నానన్నారు.












Click it and Unblock the Notifications