ఈ నెల 6న ఢిల్లీకి చంద్రబాబు - కేంద్రం ఆహ్వానం : అదే రోజు సీఎం జగన్ సైతం ..!!
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 6న ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన్ను ఢిల్లీ రావాల్సిందిగా కేంద్రం ఆహ్వానించింది. దీంతో..సుదీర్ఘ విరామం తరువాత చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. 2019 ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు ఢిల్లీకి ..జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొద్ది నెలల క్రితం మంగళగిరి సమీపంలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంపైన వైసీపీ శ్రేణుల దాడి పైన రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలో కేంద్ర హోం మంత్రితో కలిసే ప్రయత్నం చేసినా..కలవలేదు. ఇక, ఇప్పుడు కేంద్రం నుంచే టీడీపీ అధినేతకు ఆహ్వానం అందింది.

కేంద్రం నిర్వహించే ఉత్సవాల్లో
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్‌లో పాల్గొనేందుకు కేంద్రం నుంచి ఆహ్వానం రావటంతో..హాజరు కానున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించే సమావేశానికి చంద్రబాబు హాజరు అవుతారు. ఈ కార్యక్రమానికి దేశంలోని దాదాపుగా అన్ని పార్టీల అధినేతలను కేంద్రం ఆహ్వానించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ కు సైతం ఆహ్వానం అందింది. ఆ రోజున ఢిల్లీలో సమావేశానికి హాజరు కావటంతో పాటుగా ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతోనూ భేటీ అయ్యేందుకు సీఎం జగన్ అప్పాయింట్ మెంట్ కోరినట్లుగా తెలుస్తోంది. కాగా, ఆ రోజే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. దీంతో..ఎన్‌డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌ను కూడా జగన్ కలిసే అవకాశం ఉంది.

ప్రధానితో భేటీ కానున్న సీఎం జగన్
అయితే, సుదీర్ఘ విరామం తరువాత కేంద్ర ప్రభుత్వ సమావేశానికి చంద్రబాబు హాజరు కానుండటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది. 2019 ఎన్నికల్లో బీజేపీకి దూరం కావటం సరైన నిర్ణయం కాదని ఇప్పటికీ టీడీపీ నేతలు చెబుతూనే ఉంటారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో తిరిగి బీజేపీ - జనసేనతో పొత్తు పెట్టుకోవాలనేది టీడీపీ ఆలోచన. బీజేపీతో సీఎం జగన్ ఇదే తరహా మైత్రి రానున్న ఎన్నికల సమయంలో కొనసాగితే..ఎన్నికల వేళ పరోక్షంగా తమ పైన కొన్ని అంశాల్లో ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని టీడీపీ అంచనా వేస్తోంది. దీని కోసం 2019 ఎన్నికల ముందు తమను ఏ విధంగా ఎన్డీఏకు దూరంగా చేసేందుకు జగన్ ప్రరయత్నాలు చేసారో.. ఇప్పుడు టీడీపీ అదే ఫార్ములా అమలు చేయాలని చూస్తోంది. తమతో బీజేపీ పొత్తు ఉన్నా లేకున్నా..సీఎం కు బీజేపీ ముఖ్యనేతల నుంచి ఏ విధంగానూ మద్దతు ఉండకూడదనేది టీడీపీ నేతల వ్యూహం. అందులో భాగంగానే..ఎన్డీఏ కోరకపోయినా.. రాష్ట్రపతి అభ్యర్ది విషయంలో టీడీపీ ముందుకొచ్చి మద్దతు ఇచ్చింది.

పాత మిత్రులు కలుస్తారా
ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఎన్డీఏ అభ్యర్ధికే వైసీపీ మద్దతు ఇవ్వనుంది. టీడీపీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, ఇప్పుడు చంద్రబాబు పర్యటన వేళ.. తన పాత పరిచయాలను చంద్రబాబు మరోసారి క్రమేణా తెర మీదకు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారని చెబుతున్నారు. అయితే, ప్రధాని భీమవరం పర్యటన సమయంలోనూ టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. కానీ, అక్కడ సెక్యూరిటీ సిబ్బందితో సమన్వయ లోపంతో ఆయన సభకు హాజరు కాలేదు. చంద్రబాబు తిరిగి కేంద్రం తో సంబంధాల దిశగా ప్రయత్నాలు చేసినా..బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వస్తాయా అనేది కీలకంగా మారుతోంది. దీంతో.. ఇప్పుడు చంద్రబాబు పర్యటనపైన రాజకీయంగా ఆసక్తి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications