వచ్చే ఎన్నికల్లో జరిగేదిదే - కేసీఆర్ కు చంద్రబాబు అభినందనలు..!!
మరోసారి టీడీపీ అధికారంలోకి రావాలని.. ఇది చారిత్రక అవసరమని, కచ్చితంగా వస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్ర విభజన కంటే సీఎం జగన్ వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఇది మామూలు నష్టం కాదని.. అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని చెప్పారు. టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో చంద్రబాబు ఆసక్తి కర అంశాలను ప్రస్తావించారు. టీడీపీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పారు. పార్టీకి తెలంగాణలోనూ పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
పీవీ నరసింహారావు దేశాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించారని చంద్రబాబు కీర్తించారు. ఆయన ఆనాడు చేసిన సంస్కరణలతోనే ఇంత అభివృద్ధి జరిగిందన్నారు. ఆయన సంస్కరణలనే ఉమ్మడి ఏపీలోనూ ధైర్యంగా అమలుచేశానని చంద్రబాబు గుర్తు చేసారు. అందుకే అప్పుడు విజన్-2020ను ప్రకటించానన్నారు. తనను నాడు ఎవరూ అర్థం చేసుకోలేదని చెప్పుకొచ్చారు. రోడ్లు, విద్యుత్, టెలికమ్యూనికేషన్ రంగంలో అభివృద్ధికి నాంది పలికామన్నారు. ఉమ్మడి ఏపీలో హైటెక్ సిటీతో అభివృద్ధిని ప్రారంభించుకున్నామని చంద్రబాబు వివరించారు. సెల్‌ఫోన్, గ్రీన్‌ఫీల్డ్, ఎయిర్‌పోర్టులు, ఓపెన్ స్కై పాలసీ విధానాలతో మొదటిసారిగా విమానాలను తీసుకొచ్చామన్నారు. అభివృద్ధి కోసం విజన్-2020ను ప్రకటిస్తే.. నన్ను 420 అన్నారని..వారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారన్నారు.

ఈ సారి పార్టీ మహానాడు రాజమండ్రిలో చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా ఈ సారి వంద సభలు నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. వందో సభ (మహానాడు)ను రాజమండ్రిలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాలను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ చేయాలని పార్టీ నిర్ణయించింది. తెలుగు జాతి గర్వపడే విధంగా, మళ్లీ భవిష్యత్‌కు నాంది పలికే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేంద్రం వంద రూపాయల వెండి నాణేలను తెస్తోంది. ఇందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. తాను అమరావతిని ప్రారంభిస్తే లేనిపోని ఆరోపణలు చేసి.. త్యాగం చేసిన రైతులను ఇబ్బందులు పాల్జేస్తున్నారని చెప్పుకొచ్చారు. తన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన రాజశేఖర్‌రెడ్డి ఎయిర్‌పోర్టును రద్దు చేసి ఉంటే ఏమయ్యేది? భూములకు అంత విలువ పెరిగేదా అని చంద్రబాబు ప్రశ్నించారు.
తెలుగువారిలో ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు కొత్త సంకల్పాన్ని తీసుకుంటున్నామని... ఇందుకోసం త్వరలోనే విధానాన్ని ప్రకటిస్తానని చంద్రబాబు వెల్లడించారు. నాడు తాను నిర్మించదలచిన హైటెక్ సిటీ, ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టులను తన తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రద్దు చేసి ఉంటే ఈ రోజు ఇంత అభివృద్ధి జరిగేది కాదన్నారు. జీనోమ్ వ్యాలీ ఏర్పాటును కూడా అడ్డుకుని ఉంటే కొవిడ్ వ్యాక్సిన్ వచ్చేదా అని ప్రశ్నించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించిన వైఎస్, రోశయ్యతోపాటు కేసీఆర్‌ను కూడా అభినందిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. మెట్రో ప్రాజెక్టును కూడా కొనసాగించడంపై గర్వపడుతున్నానంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications