''మాట'' మార్చిన చంద్రబాబు: జగన్‌రెడ్డీ ఏం పీక్కుంటావో పీక్కో!!
ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని విభిన్నంగా చూస్తున్నామని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో ఎందరు ఎన్ని విమర్శలు చేసినా సంయమనం పాటించే బాబు ఇప్పుడు దూకుడుగా మాట్లాడుతున్నారని, అంతేకాకుండా నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేసేవారని, కానీ ఇప్పుడు దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారని, ఎక్కడిక్కడే నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయనలో వచ్చిన ఈ మార్పు రాబోయే ఎన్నికల్లో తమకు అధికారం కట్టబెడుతుందనే నమ్మకంతో ఉన్నామంటున్నారు.
జిల్లాల వారీగా మినీ మహానాడులు కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఒక జిల్లాలో పూర్తిచేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం కల్పించడానికి, వారిని పరుగులెత్తించడానికి తాను గతంలోలా ఉంటే కష్టమని గుర్తించిన బాబు తనను తాను మార్చుకోవడమే కాకుండా పార్టీ తీరుతెన్నులను కూడా మారుస్తున్నారంటున్నారు. నాయకులపై గతంలో ఏవైనా ఫిర్యాదులు వచ్చినా వారిమీద చర్యలు తీసుకోవడానికి తాత్సారం చేసేవారని, ఇప్పుడు అటువంటిదేమీ లేదని తెలుస్తోంది.

చంద్రబాబునాయుడుకు మొహమాటం ఎక్కువని తెలుగు తమ్ముళ్లు ఎప్పుడూ మాట్లాడుకుంటుంటారు. మీడియాతో కూడా ఈ విషయంమీదే ఆయనపై వార్తలు వస్తుంటాయి. ఇలాంటి మొహమాటాలకు పోయినప్పుడల్లా పార్టీ నష్టపోయిందని, ఈసారి అటువంటిదేమీ జరగకూడదనే ఉద్దేశంతో ఆయన తన మొహమాటాన్ని వదిలించుకున్నారు. అందుకు ఉదాహరణగా డోన్‌లో కేసీ సోదరులకు టికెట్ ఇవ్వకుండా సుబ్బారెడ్డికి ఇవ్వడమే దీనికి ఉదాహరణ అంటున్నారు.
బహిరంగ సమావేశాల్లో గతంలోలా మాట్లాడితే ప్రజల మనసుల్లోకి ఆ మాటలు చొచ్చుకెళ్లడం కష్టమని, మాట్లాడే ప్రతి మాట ఒక తూటాలా ఉండాలని, మాస్ డైలాగులుండాని తెలుగుదేశం పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లుగానే అందరూ సినిమా డైలాగుల్లాంటి మాటలను మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు ఎంతసేపు ప్రసంగం చేసినా ఎవరినీ విమర్శించకుండా ఆచితూచి మాట్లాడేవారు. ఎక్కడా మాట తూలేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కో మాట ఒక్కో తూటాలా పేలుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన సభలో కూడా కొన్ని పంచ్‌లు వదిలారు. ఉదాహరణకు కొన్ని పరిశీలిద్దాం..!
నా మనసు అంగీకరించకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థం కావాలంటే బూతుపురాణం మాట్లాడాలి. అలా మాట్లాడితేనే అర్థమవుతుందన్న ఉద్దేశంతో నా నోటివెంట పరుష పదజాలం వస్తోంది.
తప్పుడు కేసులకు భయపడేది లేదు.. జగన్‌రెడ్డీ.. ఏం పీక్కుంటావో పీక్కో?
రామతీర్థంలో రాముడి తల తీశారు.
పప్పు బెల్లాలు చేతికి అంటించి కోట్లు వేనకేసుకుంటున్నారు.
ఇంగ్లిష్ మీడియం పేరుతో పదోతరగతి ఫలితాలు ఢమాల్ అయ్యాయి. దీనికి తల్లిదండ్రులు ఎలా బాధ్యత వహిస్తారు? ఆయన ఏం మాట్లాడుతున్నారు? లిక్కర్ డాన్ విద్యాశాఖ మంత్రా?.












Click it and Unblock the Notifications