పవన్ కల్యాణ్ గెలుపు కోసం ఆ వ్యక్తిని బరిలోకి దింపిన చంద్రబాబు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమరాంగాణ హోరాహోరీగా తలపడేందుకు అధికార వైసీపీ, తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి సిద్ధమవుతున్నాయి. మే 13వ తేదీన ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరిగి ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ప్రత్యర్థి పార్టీల్లోని కీలకమైన నేతలను ఎన్నికల్లో గెలవకుండా నిరోధించేందుకు అన్ని పార్టీల్లోని ముఖ్యనేతలు వ్యూహాలు రచిస్తున్నారు.
ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నిలువరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తగిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. వీటిని ఎదుర్కొనేందుకే వ్యూహాత్మకంగా.. ఆలస్యంగా పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి బలమైన స్థానమైన పిఠాపురం నుంచి పవన్ ను గెలిపించే బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారు.

కొద్దిరోజులుగా నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ నిరసనలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యాలయంలోని సామగ్రిని కూడా వర్మ అనుచరులు ధ్వంసం చేశారు. అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు సోషల్ మీడియాలో ఒక నోట్ సర్క్యులర్ అయింది కానీ అది ఫేక్ అని తేలిపోయింది. స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంతనాలు సాగించిన వర్మ వారి అభిప్రాయం మేరకు చంద్రబాబును కలవడానికే నిర్ణయించుకున్నారు.
ఉండవల్లిలోని బాబు నివాసంలో కలవగా.. పార్టీ అధికారంలోకి రాగానే కచ్చితంగా న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పొత్తు ధర్మంలో భాగంగా పవన్ ను గెలిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీపైనే ఉందని, ప్రతి ఓటు జనసేనకు పడాలని, అలా సమన్వయం చేయాల్సిన బాధ్యత కూడా మీదేనంటూ వర్మకు తేల్చిచెప్పారు.

దీంతో బాబు నివాసం నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ గెలుపుకోసం తాను పనిచేస్తున్నట్లు వర్మ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోను నియోజకవర్గంలో కూటమి జెండాను రెపరెపలాడిస్తామని ప్రకటించారు. పవన్ కల్యాణ్ కోసం వర్మ పోటీచేస్తే జనసేనానికి ఊహించనంత మెజారిటీ వస్తుందని భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో వర్మ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఈసారి కూడా అలాగే పోటీచేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమరోత్సాహంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.












Click it and Unblock the Notifications