చంద్రబాబూ.. ఏమి చెప్తిరి, ఏమి చెప్తిరి: పోలవరం ప్రాజెక్టులో సుడిగుండం అట
ఏలూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇవ్వాళ ఏలూరు జిల్లాలో పర్యటించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. లోయర్ కాఫర్‌డ్యామ్, అప్పర్ కాఫర్‌డ్యామ్‌ను సందర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. అక్కడ సెల్ఫీ దిగారు.
అనంతరం అప్పర్ కాఫర్‌డ్యామ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో కాఫర్‌డ్యామ్, స్పిల్‌వే, గైడ్ బండ్‌ను నిర్మించామని అన్నారు. నది ప్రవాహం నేరుగా స్పిల్ వే మీద పడకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. తమ అయిదేళ్ల హయాంలో పోలవరంలో కాఫర్‌డ్యామ్, స్పిల్‌వేలను నిర్మించామని చెప్పారు.

2019లో తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి కొన్ని గ్యాప్స్ ఉన్నాయని, వాటిని భర్తీ చేసే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టర్, ఇంజినీర్లను మార్చిందని చంద్రబాబు ఆరోపించారు. ఆ తరువాత సంభవించిన భారీ వర్షాల వల్ల గోదావరి నదికి వరదలొచ్చాయని, ఆ జలాలన్నీ లోయర్ కాఫర్‌డ్యామ్‌లోకి వచ్చాయని అన్నారు.

నీళ్లు ఎటు పల్లం ఉంటే అటు పోటెత్తడం వల్ల సుడిగుండం ఏర్పడిందని, దాని వల్ల ఇసుక మేట వేసిందని, దాని వల్ల డయాఫ్రం వాల్ ధ్వంసమైందని చంద్రబాబు వివరించారు. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లు కట్టినా, 45.75 మీటర్లకు కట్టినా పెద్దగా ప్రభావం ఉండదని, నీళ్లన్నీ అప్పర్ కాఫర్ డ్యామ్ మీదుగా సాఫీగా వెళ్తాయని అన్నారు.
మనం ఏదో ఊహించుకుంటాం. రాష్ట్రం బాగుపడిపోవాలి. ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలి. ఇదొక మంచి అవకాశం మనకు. ఈ నీళ్లు తీసుకుపోతే సిరులు పండించుకుంటారు. అని తపనతో చేపట్టిన ప్రాజెక్టు పోలవరం. ఈరోజు చూస్తే అందరికన్నా ఎక్కువ బాధ పడుతున్న వ్యక్తిని నేనే. - పోలవరం దగ్గర చంద్రబాబుగారు… pic.twitter.com/NKsbIq0xs6
— Telugu Desam Party (@JaiTDP) August 7, 2023
వాస్తవాలను దాచి పెట్టి జగన్ మాట్లాడుతున్నాడని, 41.15 మీటర్లకే పోలవరం ఎత్తును పరిమితం చేయాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నారని విమర్శించారు. 50 లక్షల క్యూసెక్కుల వరద జలాలు ప్రాజెక్టుకు చేరుకున్నా ధ్వంసం కాని విధంగా కాఫర్ డ్యామ్‌లను తాము నిర్మించామని, జగన్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు.

41.15 మీటర్ల ఎత్తుకు పోలవరం ప్రాజెక్టును పరిమితం చేయడం వల్ల 60 నుంచి 70 టీఎంసీల నీళ్లే నిల్వ ఉంటాయని, దాని వల్ల ప్రయోజనం ఉండబోదని చంద్రబాబు అన్నారు. 400 కోట్ల రూపాయలను ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. పోలవరం అనేది చాలా సున్నితమైన, ప్రమాదకరమైన ప్రాజెక్టుగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications