లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు- రాత్రంతా మేల్కొనే ఉన్నా: నేడు బ్లాక్ డే: చంద్రబాబు..!!
ఏపీ అసెంబ్లీలో టీడీపీ-వైసీపీ సభ్యుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చీకటి రోజుగా అభివర్ణించారు.
అమరావతి: శాసన మండలి పట్టభద్ర నియోజకవర్గాలకు నిర్వహించిన ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ.. స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులపై పైచేయి సాధించింది. టీడీపీ అభ్యర్థులు వేపాడ చిరంజీవి రావు-ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ - కంచర్ల శ్రీకాంత్, పశ్చిమ రాయలసీమ- భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి విజయం సాధించారు.

సన్మానించిన చంద్రబాబు
ఈ ముగ్గురూ ఇవ్వాళ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా ముగ్గురినీ చంద్రబాబు శాలువా కప్పి సన్మానించారు. టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సహా పలువురు పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను వారు చంద్రబాబుతో పంచుకున్నారు. ఎన్నో అవాంతరాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని వివరించారు.

భూమిరెడ్డి విజయం..
అనంతరం చంద్రబాబు మాట్లాడారు. పట్టభద్ర నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో పార్టీ సీనియర్లందరి అభిప్రాయలను తీసుకున్నామని, వారి పేర్లకు లోకేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య పులివెందులకు చెందిన భూమిరెడ్డి రామ్ భూపాల్ రెడ్డి విజయం సాధించారని చంద్రబాబు ప్రశంసించారు. ఇన్ని రోజులు పులివెందుల పులి అనుకుంటోన్న వ్యక్తి ఇప్పుడు పిల్లిగా మారాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు.

పులివెందుల పులి..
రామ్ భూపాల్ రెడ్డి ఇప్పుడు పులివెందుల పులిగా మారాడని చంద్రబాబు కితాబిచ్చారు. పులివెందుల రౌడీయిజానికి ధీటుగా నిల్చుని గెలవడం అంటే మాటలు కాదని పేర్కొన్నారు. గెలిచిన తరువాత డిక్లరేషన్ ఇవ్వకుండా రిటర్నింగ్ అధికారి భూమిరెడ్డిని ఎంతో ఇబ్బందులకు గురి చేశాడని చంద్రబాబు ఆరోపించారు. ఈ తతంగం మొత్తాన్నీ తాను రాత్రంతా మేల్కొనే ఉండి పర్యవేక్షించానని, పార్టీ నాయకులతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకున్నానని వివరించారు. బలవంతంగా డిక్లరేషన్ ఇప్పించుకున్నామని చంద్రబాబు గుర్తు చేశారు.

అసెంబ్లీ చరిత్రలో..
తమ పార్టీ సభ్యులపై అసెంబ్లీలో వైసీపీ సభ్యులు దాడి చేశారని, ఇది చరిత్రలో చీకటిరోజుగా మిగిలిపోతుందని చంద్రబాబు అన్నారు. డోలా బాలా వీరాంజనేయులును వైసీపీ సభ్యులు అమానుషంగా కొట్టారని ఇంతకంటే బ్లాక్ డే మరొకటి ఉండదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకులను చివరికి పోలీసులు కూడా కాపాడలేరని, బట్టలు విప్పిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. పోలీసుల కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని, ఎంతకైనా తెగిస్తామని తేల్చి చెప్పారాయన.

జగన్ ఓ లెక్క కాదు..
తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను చవి చూసిందని, ఎందరితోనో పోరాడిందని చంద్రబాబు అన్నారు. అలాంటి ఘన చరిత్ర ఉన్న పార్టీకి జగన్ ఓ లెక్క కాదని ఎద్దేవా చేశారు. పోలీసులు, అధికార యంత్రాంగం పెడుతున్న ఇబ్బందులన్నింటినీ తాము గుర్తు పెట్టుకుంటామని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని అన్నారు. జీఓ నంబర్ 1ను తీసుకొచ్చి- ప్రజాస్వామ్యాన్ని జగన్ ప్రభుత్వం అపహాస్యం చేసిందని, ప్రతిపక్షాల గొంతు నొక్కిందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications