ప్రత్యేకంగా ఆహ్వానించిన చంద్రబాబు- లేఖ సారాంశం ఇదే..!!
రాజమండ్రి: రాజమండ్రి వేదికగా.. తెలుగుదేశం పార్టీ మహానాడును జరుపుకొంటోంది. ఇవ్వాళ రెండో రోజు. పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతి కూడా తోడుకావడంతో ఇవ్వాళ్టి కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు కీలక తీర్మానాలను ఆమోదించనుంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం తన ముగింపు సభలో పలు కీలక అంశాలను ప్రకటించే అవకాశం ఉంది.
ఎన్టీ రామారావు శతజయంత్యుత్సవాలను పురస్కరించుకుని చంద్రబాబు- తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా బహిరంగ లేఖ రాశారు. ఇవ్వాళ్టి మహానాడు కీలకమైనదని, పెద్ద ఎత్తున తరలి రావాలంటూ ప్రత్యేకంగా ఆహ్వానించారు. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అనే మూల సిద్ధాంతంతో ఆయన ఈ పార్టీని నెలకొల్పారని, ఆయన ఆశయాలను మరోసారి గుర్తు చేసుకుందామని విజ్ఞప్తి చేశారు.

పేదలకు 2 రూపాయలకే కిలోబియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తిలో సమానహక్కు, బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు.. వంటివి ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను ఎంతో మెరుగుపర్చాయని చంద్రబాబు అన్నారు. యువత, మహిళలను రాజకీయాల్లోకి ఆహ్వానించడం ద్వారా ఎన్టీఆర్ కొత్త తరం రాజకీయాలకు అంకురార్పణ చేశారని పేర్కొన్నారు.
ఎన్టీ రామారావు స్ఫూర్తిని ఇప్పటి తెలుగుదేశం నాయకత్వం పుణికిపుచ్చుకుందని, ఆయన ఆశయాల సాధనే లక్ష్యంగా పని చేస్తోందని చంద్రబాబు అన్నారు. ఐటీ రంగంలో ఉన్న అవకాశాలను ముందే పసిగట్టి ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్నామని, ఫలితంగా ఈ రంగంలో ఏపీ ఎంతో ప్రగతి సాధించిందని అన్నారు. అనేక దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడటానికి తెలుగుదేశమే ప్రధాన కారణమని తేల్చి చెప్పారు.
గత నాలుగు సంవత్సరాల్లో ఏపీ రాజకీయ అవినీతితో కొట్టుమిట్టాడుతోందని, పరిపాలన వైఫల్యాలు ప్రజలను పీడిస్తోన్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. 40 సంవత్సరాల పాటు వెనక్కి వెళ్లిందంటూ మండిపడ్డారు. పక్షపాత వైఖరి, కక్షసాధింపు చర్యలు, స్వార్థ ప్రయోజనాలకు ఏపీ కేంద్రంగా మారిందంటూ ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయని, ప్రజాస్వామ్య విలువలు పరిహాసానికి గురవుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తోందంటూ చంద్రబాబు విమర్శించారు. పత్రికా స్వేచ్ఛకు గ్రహణం పట్టిందని, న్యాయస్థానం ఇచ్చే తీర్పులను సైతం బేఖాతర్ చేస్తోందని అన్నారు. రాజధాని లేని అనాథలా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చిన ఈ మూకలను ఉపేక్షించకూడదని సూచించారు.












Click it and Unblock the Notifications