టీడీపీ నేత పట్టాభిరామ్ కిడ్నాప్: భార్య ఆందోళన: డీజీపీకి చంద్రబాబు లేఖ..!!
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి పట్ల చంద్రబాబు ఘాటుగా స్పందించారు. తమ పార్టీ నాయకుడు పట్టాభిరామ్ ను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఈ మేరకు డీజీపీకి లేఖ రాశారు.
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరంలో తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితులపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సాయంత్రం గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై స్థానిక శాసన సభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ వర్గీయులు దాడి పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ను అపహరించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నింటినీ వివరిస్తూ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి మూడు పేజీల లేఖ రాశారు.
వ్యక్తిగత దూషణలే..
వల్లభనేని వంశీపై తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యక్తిగత దూషణలు చేశారనే కారణంతో ఆయన వర్గీయులు పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలను పగులగొట్టారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఆఫీస్ ఆవరణలో పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టారు. దీనితో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
డీజీపీకి లేఖ..
దీనిపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. డీజీపీకి లేఖ రాశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్నాడని విమర్శించారు. ఆ మంటల్లో జగన్ కాలిపోవడం ఖాయమని, వైఎస్ఆర్సీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారంటూ ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవే లేకుండా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు శాఖను మూసేశారా? లేక దాన్ని వైఎస్ఆర్సీపీలో విలీనం చేశారా? అంటూ నిలదీశారు.

పట్టాభిరామ్ కిడ్నాప్..
తమ పార్టీ నాయకుడు పట్టాభిరామ్ కిడ్నాప్ అయ్యారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్త కనిపించట్లేదంటూ పట్టాభిరామ్ భార్య ఆందోళనలో ఉన్నారని చెప్పారు. తన భర్తను ఎవరో అపహరించారంటూ పట్టాభిరామ్ భార్య ఆవేదన వ్యక్తం చేస్తోన్న వీడియోను ఈ లేఖతో పాటు డీజీపీకి పంపించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ నాయకుడు దొంతు చిన్నయ్య ఇంటిపైనా వైసీపీ గూండాలు దాడి చేశారని, ఆయనను తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు.
ఆటవిక రాజ్యం..
రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని చంద్రబాబు విమర్శించారు. గతంలో కూడా పట్టాభిరామ్ పై వైఎస్ఆర్సీపీ నాయకులు దాడులు చేశారని గుర్తు చేశారు. పట్టపగలు గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడులు చేస్తోంటే పోలీసులు ఏం చేస్తోన్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కట్టుతప్పాయని పేర్కొన్నారు. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications