ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోంది
బోగస్, నకిలీ ఓట్లను చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యంలో అపహాస్యం పాలవుతోందని చంద్రబాబు అన్నారు.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు, అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆయన సంఘానికి లేఖ రాశారు. వైసీపీ నేతలతో పలుచోట్ల ఎన్నికల అధికారులు కుమ్మక్కవడంతోనే భారీసంఖ్యలో బోగస్ ఓట్లు నమోదయ్యాయన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వెలుగుచూసిన బోగస్ ఓట్ల వివరాలను తన ఫిర్యాదుకు జతచేశారు.
బోగస్, నకిలీ ఓట్లను చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యంలో అపహాస్యం పాలవుతోందని, గతంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో కూడా ఈ తంతు నడిచిందని, పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే పునరావృతమవుతోందని, డిగ్రీ చదవనివారు నకిలీ సర్టిఫికెట్లతో ఓటర్లుగా నమోదైనట్లు చెప్పారు. కొందరు ఎన్నికల అధికారులు నకిలీ పత్రాలపై ఎటువంటి పరిశీలన జరపకుండానే ఆమోదం తెలిపారన్నారు. తిరుపతిలోని 44వ డివిజన్‌లో చికెన్ దుకాణం అడ్రస్‌తో 16 బోగస్ ఓట్లు నమోదు చేశారని, చాలా ప్రాంతాల్లో ఈ తరహాలోనే జరిగిందని తెలిపారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి బోగస్ ఓట్లపై విచారణ జరపాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని గుర్తుచేశారు. ఈ బోగస్, నకిలీ ఓట్లు ప్రాథమిక హక్కులకు, ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర నష్టం కలిగిస్తాయన్నారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకుని అక్రమాలను అడ్డుకోవాలని, బోగస్ ఓట్ల నమోదులో పాల్గొన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలి'' అని లేఖలో సీఈసీని చంద్రబాబు కోరారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రను తాత్కాలికంగా విరమించి హైదరాబాద్ చేరుకున్నారు. యువగళం పేరుతో యువత సమస్యలను ప్రస్తావిస్తూ వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ యాత్రను ప్రారంభించారు. 4వేల కిలోమీటర్లమేర సాగే ఈ యాత్ర 520 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది.












Click it and Unblock the Notifications