విజయమ్మను టార్గెట్ చేసిన టీడీపీ - మద్దతెవరికి..!!
ఏపీ ఎన్నికల రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. ఇప్పటి వరకు జగన్ లక్ష్యంగా బరిలోకి దిగిన టీడీపీ కూటమి నేతలు ఇప్పుడు విజయమ్మను టార్గెట్ చేస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్దులుగా షర్మిల, అవినాశ్ పోటీలో ఉన్నారు. అదే విధంగా మరో సారి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా జగన్...కాంగ్రెస్ గెలుపు కోసం షర్మిల పని చేస్తున్నారు. ఈ సమయంలో విజయమ్మ ఎవరి వైపో తేల్చాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేయటం కీలకంగా మారుతోంది.
మారుతున్న లెక్కలు
ఏపీ ఎన్నికల్లో కడప రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కడపలో రెండు సార్లు ఎంపీగా గెలిచిన అవినాశం వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. అవినాశ్ పైన పోటీ చేస్తున్నారు. సీఎం జగన్ ఇడుపులపాయ కేంద్రంగా తన పార్టీ అభ్యర్దులను ప్రకటించారు. అక్కడి నుంచే తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జగన్ ను తల్లి విజయమ్మ ఆశీర్వదించి వైఎస్సార్ ఘాట్ నుంచి ప్రచారానికి పంపారు. ఆ తరువాత షర్మిల సైతం వైఎస్సార్ ఘాట్ వేదికగా తన పార్టీ అభ్యర్దులను ప్రకటించారు. షర్మిలతోనూ విజయమ్మ కలిసి వచ్చారు. దీంతో, విజయమ్మ ఎవరి వైపు నిలుస్తారనే చర్చ మొదలైంది.

టార్గెట్ విజయమ్మ
ఇప్పటి వరకు జగన్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన టీడీపీ తొలి సారి విజయమ్మను కార్నర్ చేసింది. విజయమ్మ జగన్, షర్మిల, అవినాశ్ లో ఎవరి వైపు నిలుస్తారో చెప్పాలని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి డిమాండ్ చేశారు. మీ ఇద్దరు బిడ్డలు మేనిఫెస్టో, అభ్యర్థుల జాబితా విడుదల చేసినప్పుడు వైఎస్ సమాధి వద్దకు వెళ్లారు కదా.. నీబిడ్డ అని చెప్పుకొనే జగన్... రాజశేఖరరెడ్డి బిడ్డ షర్మిల పోటీ చేస్తున్నారు.. వైఎస్‌కు ఆత్మ ఉంటే తన కూతురు వైపు నిలబడతాడా నిలబడరా..? అంటూ ప్రశ్నించారు. విజయమ్మ ఎవరి వైపు నిలుస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని బీ టెక్ రవి పేర్కొన్నారు. కనీసం పులివెందుల వాసులకైనా తెలపాలని వ్యాఖ్యానించారు.
మద్దతు ఎవరికి
గతంలో జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. తన కుమారుడు సీఎం అయ్యారని..తెలంగాణలో పోరాటం చేస్తున్న కుమార్తె షర్మిలకు మద్దతు ఇవ్వటానికి తాను నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు షర్మిల ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఏపీ ఎన్నికల్లో షర్మిల తన అన్న జగన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ సమయంలో కుమార్తె - కుమారుడు మధ్య జరుగుతున్న రాజకీయ యుద్దంలో విజయమ్మ మద్దతు ఎవరికి ఇస్తున్నారని టీడీపీ ప్రశ్నిస్తోంది. రాజకీయాలతో సంబంధం లేకుండా విజయమ్మ తల్లిగా జగన్ - షర్మిలకు మద్దతుగా నిలుస్తున్నారనేది వైసీపీ నేతల వాదన. ఇప్పుడు టీడీపీ తాజాగా ప్రశ్నిస్తుండటంతో విజయమ్మ స్పందిస్తారా..స్పష్టత ఇస్తారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications