వంగవీటి రంగా పేరు విజయవాడ కొత్తజిల్లాకు పెట్టాల్సిందే; వంగవీటి రాధాపైనా బోండా ఉమ ఆసక్తికరవ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అనేక జిల్లాలలో వివాదాలకు కారణంగా మారింది. ముఖ్యంగా కొన్ని జిల్లా కేంద్రాలను మార్చాలని, కొన్ని జిల్లాల పేర్ల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పలు జిల్లా కేంద్రాలపై, పేర్ల మార్పుపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలంటూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ కూడా దీనిపై ఉద్యమానికి రెడీ అవుతోంది.

విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని టీడీపీ ఆందోళన
ఈ నేపథ్యంలో రేపు విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలన్న డిమాండ్ తో వేలాది మందితో ఆందోళన నిర్వహించనున్నట్టు తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమామహేశ్వర రావు వెల్లడించారు. ఇక ఇదే సమయంలో ఆయన వంగవీటి రాధా పై, మంత్రి కొడాలి నాని పై, వల్లభనేని వంశీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపు ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్టు పేర్కొన్న బోండా ఉమా వంగవీటి రాధా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వంగవీటి రాధాపై బోండా ఉమా ఆసక్తికర వ్యాఖ్యలు
విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలని రంగా కుటుంబ సభ్యులు కూడా వారి సన్నిహితుడైన కొడాలి నాని వంశీమోహన్ ద్వారా ప్రయత్నిస్తున్నారేమో అంటూ బోండా ఉమా పేర్కొన్నారు. వంగవీటి రాధాకు వల్లభనేని వంశీ, కొడాలి నానితో మంచి సంబంధాలు ఉన్నాయని ఓ ఫోన్ కాల్ ద్వారా గాని, మెసేజ్ ద్వారా గాని వంగవీటి రాధా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారేమో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 26వ తేదీన వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా రంగా విగ్రహావిష్కరణ సమయంలోనూ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కార్యక్రమంలో పాల్గొన్నారని విషయాన్ని బోండా ఉమా గుర్తు చేశారు.

వంగవీటి రంగా పేరు విజయవాడకు పెట్టకుంటే ఆయనను అవమానించినట్టే
విజయవాడ కేంద్రంగా ఉండే జిల్లాలో వంగవీటి మోహన్ రంగా విగ్రహం లేని ప్రాంతం లేదని బోండా ఉమ స్పష్టం చేశారు. వంగవీటి రంగా పేరు పెట్టడం కోసం అవసరమైతే సీఎం ఇల్లు ముట్టడికి కూడా సిద్ధమని బోండా ఉమ స్పష్టం చేశారు. వంగవీటి రంగా పేరు విజయవాడకు పెట్టకుంటే ఆయనను అవమానించినట్టేనని తేల్చి చెప్పారు. వంగవీటి రంగా పేదల కోసం నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలు అర్పించారు అని బోండా ఉమ పేర్కొన్నారు. ఆ మహానేత పేరు పెట్టకుంటే సీఎం జగన్ చరిత్రహీనులు అవుతారు అని మండిపడ్డారు. విజయవాడకు రంగా పేరు పెట్టడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఖర్చు కాదని తేల్చి చెప్పారు.

మీడియా ద్వారా వంగవీటి రాధాకు దీక్షకు ఆహ్వానం
ఇక ఇదే సమయంలో విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని తాము తలపెట్టిన దీక్షకు ఆహ్వానించడం కోసం వంగవీటి రాధా కృష్ణ తమకు ప్రస్తుతం అందుబాటులో లేరని, మీడియా ద్వారానే ఆయనను దీక్షకు ఆహ్వానిస్తున్నామని బోండా ఉమ స్పష్టం చేశారు. వంగవీటి రంగా ఒక కుటుంబానికో, ఒక కులానికో, మతానికో చెందిన వ్యక్తి కాదని పేర్కొన్న బోండా ఉమ ఆయన అన్ని వర్గాల ప్రజల మనిషి అని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ప్రకటన తర్వాత నుంచి తాము విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బోండా ఉమా మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తూర్పు కృష్ణకు ఎన్టీఆర్ పేరును విజయవాడ కేంద్రంగా ఉండే జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
Recommended Video

గుడివాడ క్యాసినో ఇష్యూ పక్కదారి పట్టించటం కోసమే కొత్త జిల్లాలు
ఇదే సమయంలో జిల్లాల విభజనపై వైసిపి సర్కారు తీరుపై విమర్శలు గుప్పించిన బోండా ఉమా జిల్లాల పునర్విభజన కోసం సలహాలు తీసుకోలేదని, వైసిపి ప్రభుత్వం సొంత పార్టీ వ్యవహారంలో నిర్ణయం తీసుకుందని అసహనం వ్యక్తం చేశారు.13 జిల్లాలలో స్థానికంగా అనేక మంది మహా నేతలు ఉన్న వారి పేర్లను అక్కడ జిల్లాల పేర్ల కోసం పరిశీలించలేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గుడివాడ క్యాసినో వ్యవహారాన్ని పక్కదారి పట్టించడం కోసమే కొత్త జిల్లాల అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని ఆరోపణలు చేసిన బోండా ఉమా, ఏది ఏమైనా విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాల్సిందేనని, అప్పటి వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications