నాలెడ్జ్ హబ్ పేరిట 'జ్ఞానభేరి'లో టిడిపి రాజకీయ ప్రచారం...ప్రజాధనం దుర్వినియోగం:సిపిఎం మధు
విజయవాడ:తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ తయారు చేస్తామంటూ...'జ్ఞానభేరి' కార్యక్రమం పేరుతో ప్రజా ధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు.
ఈ మేరకు పార్టీ ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ కార్యక్రమం ద్వారా రాజకీయ ప్రచారం చేయడాన్ని సిపిఎం ఖండించింది. ఇటీవల శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో జ్ఞానభేరి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీల్లో జరిగే జ్ఞానభేరి కార్యక్రమానికి ఒక్కోదానికీ రూ. 1 కోటి చెల్లించారని సిపిఎం మధు తెలిపారు.

రాష్ట్రాన్ని నాలెజ్డ్ హబ్‌గా తయారు చేస్తున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విఐటి, ఎస్‌ఆర్‌ఎం వంటి యూనివర్సిటీలు తీసుకొచ్చామని, సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానం సాధించామని తిరుపతి జ్ఞానభేరి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారని సిపిఎం మధు గుర్తుచేశారు. యూనివర్సిటీల్లో జరిగే జ్ఞానభేరి కార్యక్రమానికి ఒక్కోదానికీ కోటి రూపాయలు చెల్లించడం...ప్రజా ధనాన్ని భారీగా దుర్వినియోగం చేయడమేనన్నారు.
బాబు వస్తే జాబు వస్తుందని గత ఎన్నికల సందర్భంగా ప్రచారం చేశారని, నాలుగేళ్ల నుంచి వివిధ శాఖల్లో 2.12లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదని మధు వెల్లడించారు. ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా కొత్తగా నాలెడ్జ్ హబ్ చేస్తామనడాన్ని ప్రజలు విశ్వసించడం లేదని మధు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఈ విధంగా ప్రచారం కోసం వెచ్చిస్తున్న కోట్ల రూపాయల సొమ్ముతో యూనివర్సిటీల్లో అధ్యాపకులను నియమిస్తే ఇంతకంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని సూచించారు.
మరోవైపు నన్నయ్య, కృష్ణా యూనివర్సిటీల్లో భవనాల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని మధు తెలిపారు. అలాగే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూనే వ్యవసాయ సంబంధిత విద్యను విస్మరిస్తోందని, వ్యవసాయ విద్యాప్రమాణాలు అంతకంతకూ దిగజారిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఎఆర్) ప్రకటించిన ర్యాంకుల్లో ఎపి వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ యూనివర్సిటీలు వెనుకబడిపోయాయని మధు చెప్పారు.
వాస్తవాలు ఇలా ఉండటంతో టిడిపి ప్రభుత్వం జ్ఞానభేరి పేరుతో సాగిస్తున్న రాజకీయ స్వప్రయోజన కార్యక్రమాన్ని విద్యార్థులు, మేధావులు నిరసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజా ధనాన్ని రాజకీయ ప్రచారానికి వినియోగించడాన్ని స్వస్తి చెప్పాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మధు తన లేఖలో డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications