Gudivada Politics:గుడివాడ ఎవరి అడ్డా - హోరాహోరీ..!
గుడివాడ: ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అధికారమే లక్ష్యంగా సీఎం జగన్, అటు చంద్రబాబు, పవన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కీలక నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనేది చర్చనీయాంశంగా మారింది. గుడివాడ నుంచి మాజీ మంత్రి కొడాలి నాని ఇప్పుడు టీడీపీ హిట్ లిస్ట్ లో ఉన్నారు. అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా వెనిగళ్ళ రాము పోటీ చేయటం ఖాయమైంది.
గుడివాడలో ఎవరు పోటీ చేసినా తనదే గెలుపంటూ కొడాలి నాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కొడాలి నానిని ఓడించి తీరుతామని రాము ధీమాగా చెబుతున్నారు. గత కొంతకాలంగా రాము నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో పాటుగా, టీడీపీ శ్రేణులను కలుపుకుపోతున్నారు. వరదల సమయంలో రైతులకు అండగా నిలిచారు. సొంత నిధులతో సాయమందించారు. నియోజకవర్గంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఓటరుకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గుడివాడ సీటు పైన ఇప్పటికే చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. రావి వెంకటేశ్వరరావుకు అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి పైన హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెనిగళ్ళ రాము గుడివాడలో సరైన అభ్యర్థిగా చంద్రబాబు గుర్తించారు.

తాజాగా వెనిగళ్ళ రాము నియోజకవర్గంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. పార్టీ శ్రేణులంతా ఐకమత్యంతో గెలుపు కోసం పని చేయాలని సూచించారు. చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ఎన్నికల్లో పనిచేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జి మధ్య విభేదాలను రాము పరిష్కరించారు. ఇద్దరి మధ్య సఖ్యత కుదిరించారు. ఎప్పుడు ఎవరికి ఏ కష్టం ఉన్నా తాను అండగా ఉంటానని పార్టీ కోసం ఐక్యంగా ముందుకు సాగుదాం అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రస్తుతం జనసేనతో పొత్తు ఖరారు కావడంతో ఆ పార్టీ శ్రేణులను కలుపుకుపోవాలని రాము సూచించారు.ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. నియోజకవర్గంలో సుదీర్ఘకాలం తర్వాత తిరిగి టిడిపి జెండా ఎగరబోతోందని ఇదే పార్టీ అధినేతకు అందరం కలిసి ఇచ్చే గొప్ప బహుమానంగా నిలుస్తుందని క్యాడర్లో రాము జోష్ నింపారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదని అందరం ప్రజలతో మమేకమై అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.

వర్గ విబేధాలు పక్కనబెట్టి అందరూ కలిసి రావాలని రాము పిలుపునివ్వడంతో గుడివాడ టీడీపీ కార్యకర్తలంతా ఒక్కటయ్యారు. రాము గెలుపునకు తామంతా కృషి చేస్తామని విబేధాలు ఇకపై కనిపించవని హామీ ఇచ్చారు.వైసీపీ పాలనలో జరిగిన నష్టంతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తిరిగి చంద్రబాబు సీఎం అవ్వటం ద్వారానే రాష్ట్రానికి మేలు జరుగుతుందని రాము చెప్పుకొచ్చారు. ఇకనుంచి పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేద్దామంటూ రాము పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications