ఎంతమంది కలిసొచ్చినా.. ఓకే: వైవీ సుబ్బారెడ్డి
కాకినాడ: వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ- జనసేన ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకొని వెళ్లే దిశగా ఆ రెండు పార్టీలు తమవంతు ప్రయత్నాలు సాగిస్తోన్నాయి.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా కలిసి పని చేస్తామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. తన ఢిల్లీ పర్యటనలోనూ ఆయన ఇదే అంశాన్ని బీజేపీ అధిష్ఠానం వద్ద ప్రస్తావించినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రస్థాయిలో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు సాధ్యపడుతుందనీ ఆయన వ్యాఖ్యానించారు.

ఈ పరిణామాలపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ప్రజాక్షేత్రంలో తమను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం తెలుగుదేశం, జనసేన పార్టీలకు లేదంటూ ఎద్దేవా చేశారు. తాము గెలుస్తామనే నమ్మకం లేకపోవడం వల్లే ఆ రెండు పార్టీలు పొత్తుల కోసం అర్రులు చాస్తోన్నాయని చురకలు అంటించారు.
ఇవ్వాళ ఆయన కాకినాడ జిల్లాలో పర్యటించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, వేర్వేరుగా వచ్చినా.. చివరికి రామోజీరావును వెంటబెట్టుకుని వచ్చినా తమ పార్టీకి ఓటమి అనేది ఉండబోదని వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా నాయకుడని కితాబిచ్చారు.

జనం మద్దతు జగన్‌కే ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. ముందస్తు ఎన్నికలు జరిగినా.. షెడ్యూల్ ప్రకారమే వచ్చినా గెలుపు తమదేనని పేర్కొన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపైనా ఆయన స్పందించారు. వివేకా హత్యోదంతం వెనుక ఎవరున్నారనేది న్యాయస్ధానాలు బయటపెడతాయని, ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు ముమ్మరం సాగుతోందని వ్యాఖ్యానించారు.
న్యాయస్ధానాలపై తమకు నమ్మకం ఉందని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వివేకా హత్యకేసు దర్యాప్తు ఆరంభంలో గూగుల్ టేకౌట్‌ను సీబీఐ ఎందుకు ప్రస్తావించలేకపోయిందని, మధ్యలో ఈ అంశాన్ని ఎందుకు తెర మీదికి తీసుకొచ్చిందో అందరికీ తెలిసిన వ్యవహారమేనని ఆయన అన్నారు. న్యాయస్ధానాలను పక్కదారి పట్టించేలా సీబీఐ వ్యవహరించిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications