పవన్‌కు కొత్త తలనొప్పి- క్యాడర్‌లో అసంతృప్తి- కాపుల్లో చీలిక?
TDP Janasena alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
ఈ జాబితా విడుదల వ్యవహారం.. జనసేన క్యాడర్‌లో చిచ్చు పెట్టింది. తీవ్ర అసంతృప్త వాతావరణానికి దారి తీసింది. జనసేన పార్టీ నాయకులు అధిక సీట్లల్లో పోటీ చేయాలని కోరుకున్నప్పటికీ.. దానికి పూర్తి భిన్న ఫలితాలు రావడంతో భగ్గుమంటోన్నారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, కాపులకు రాజ్యాధికారం దక్కాలని ఆశించిన వారికి ఈ సీట్ల పంపకాలు తీవ్ర నిరుత్సాహానికి గురి చేశాయి.

చంద్రబాబు మరోసారి తన సహజ నైజాన్ని బయటపెట్టుకున్నట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేదొకటి..బయటకు ఎన్ని చెప్పినా.. ఎన్ని నీతులు మాట్లాడినా చివరగా తనకు, తన పార్టీకి లబ్ది చేకూరేలా మాత్రమే పొత్తులు ఉండాలన్నది అయన కాన్సెప్ట్. దీన్ని మళ్లీ నిరూపించుకున్నారు చంద్రబాబు.
ఇదే క్రమంలో ఇన్నాళ్లుగా జనసేనలో పొత్తు అంటూ పవన్ కల్యాణ్, కాపు సామాజిక వర్గం బలాన్ని తనకు అనుకూలంగా వాడుకుంటూ వచ్చిన చంద్రబాబు పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన రోజు తన నిజ రూపాన్ని బయటపెట్టారు. తొలివిడతలో మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు తెలుగుదేశానికి 94, జనసేనకు 24 సీట్లు ఇచ్చారు.
ఇక్కడే అసలు మతలబు ఉంది. తెలుగుదేశం వాటా కింద వచ్చిన 94 స్థానాలకూ అభ్యర్థుల పేర్లను సైతం ప్రకటించారు చంద్రబాబు. జనసేనకు కేటాయించిన 24 నియోజకవర్గాల్లో అయిదుమంది అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించారు. మిగిలిన 19 స్థానాల్లో ఎవరు ఉంటారన్నది తేల్చలేదు..

అంటే- అక్కడ కూడా చంద్రబాబు సూచించిన అభ్యర్థులనే జనసేన తరఫున పోటీ చేయించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. జనసేన, టీడీపీ కూటమి 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాటిలో జనసేనకు ఎన్ని ఇస్తారనేది సస్పెన్స్. ఈ 57 స్థానాల్లో జనసేనకు మొండిచెయ్యే చూపిస్తారనే వాదనలు ఉన్నాయి కూడా.
తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 94 నియోజకవర్గాల్లో చంద్రబాబు, కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. జనసేన అభ్యర్థుల జాబితాలో మాత్రం అలాంటి ప్రముఖుల పేర్లు మాయం అయ్యాయి. జనసేన తరఫున అయిదుమంది పేర్లు చెప్పినా అందులో పవన్ కల్యాణ్ పేరు లేదు.
దీన్ని బట్టి చూస్తే- పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని చంద్రబాబే ఖరారు చేస్తారనేది స్పష్టమౌతోంది. చివరికి- సేనాని పవన్ కళ్యాణ్ కూడా తన సీటు తాను ప్రకటించుకోలేని స్థితిలో పొత్తుకు సిద్ధం అయ్యారని, చంద్రబాబుకు తలొగ్గారని జనసైనికులు, పార్టీ మద్దతుదారులు ఆవేదన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications