కాపులకు చంద్రబాబు ఏనాడైనా న్యాయం చేశాడా?: పాతిక సీట్లకు పవన్ అమ్ముడుపోయాడు
TDP Janasena alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన నేపథ్యంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంపకాల వ్యవహారం తేలింది. 118 మంది అభ్యర్థులతో కూడిన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
ఇందులో 94 నియోజకవర్గాల్లో టీడీపీ, 24 చోట్ల జనసేన అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. చంద్రబాబు, కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు టీడీపీ జాబితాలో చోటు చేసుకున్నాయి. జనసేన తొలి జాబితాలో పవన్ కల్యాణ్ పేరు లేదు.

తమ పార్టీకి 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలను మాత్రమే కేటాయించడం పట్ల జనసేన క్యాడర్ భగ్గుమంటోంది. అనేక చోట్ల పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తోన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలనూ తగులబెడుతున్నారు. నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి చంద్రబాబు ఆడిన నాటకంగా విమర్శిస్తోన్నారు.
టీడీపీ- జనసేన సీట్ల పంపకాలపై తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. తన కొడుకు లోకేష్‌ను కాదని దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌కు వంద సీట్లను ఇచ్చి, ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబు మూర్ఖుడు కాదని అన్నారు. కాపులకు గానీ, బీసీలకు గానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా న్యాయం చేశాడా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రకటించిన 94 సీట్లల్లో బీసీలు గానీ, కాపులు గానీ ఉన్నారా? అని కేఏ పాల్ నిలదీశారు. కాపులు, బీసీలు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయని పవన్ కల్యాణ్, చంద్రబాబుతో ఉంటారా? లేక ప్రజా శాంతి పార్టీతో ఉంటారా? అనేది వారంతా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications