ఎన్నికల వరాలపై టీడీపీ -జనసేన కసరత్తు : కీలక నిర్ణయాలు..!!
ఎన్నికల హామీల పై టీడీపీ, జనసేన కసరత్తు ప్రారంభించాయి. జగన్ ఓటమే లక్ష్యంగా జత కట్టిన ఈ రెండు పార్టీలు ఎన్నికల రోడ్ మ్యాప్ ఖరారు చేయనున్నాయి. జగన్ అమలు చేస్తున్న సంక్షేమం పైన ప్రధానంగా గెలుపు ఆశలు పెట్టుకోవటంతో తమ కూటమి నుంచి ప్రకటించాల్సిన హామీల పైన చర్చ మొదలు పెట్టాయి. ఉమ్మడి సభలతో ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నాయి. ఈ మేరకు కీలక నిర్ణయాలు ప్రకటించేలా కార్యాచరణ ఖరారు కానుంది.
సమన్వయం దిశగా : ఈ రోజు తెలుగుదేశం - జనసేన సమన్వయ కమిటీ సమావేశం విజయవాడలో జరుగనుంది. క్షేత్రస్థాయిలో ఇరుపార్టీల సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. వివిధ జిల్లాల్లో పర్యటనకు సంబంధించి ప్రచార వ్యూహాలు, రూట్ మ్యాప్ తదితర అంశాలపైనా చర్చించనున్నారు.

టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులుగా కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య ఉన్నారు. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో తొలి విడత మ్యానిఫేస్టోను చంద్రబాబు విడుదల చేశారు. మ్యానిఫేస్టోను ఈసారి ఉమ్మడిగా రూపొందించాలని నిర్ణయించారు.
ప్రచారం పైనే ఫోకస్ : జనసేన కమిటీ సభ్యులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్వినిలు పాల్గొననున్నారు. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల కేడర్ మరింత సమన్వయంతో పనిచేసేందుకు చేపట్టాల్సిన చర్యలపైనా నిర్ణయాలు తీసుకోనున్నారు. దీంతో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ‌్ కలసి పాల్గొనేలా సభలను ఏర్పాటు చేసేందుకు కూడా ఒక రోడ్డు మ్యాప్ ను రూపొందించనున్నారు.
జగన్ తాను అమలు చేసిన సంక్షేమం తిరిగి అధికారానికి దగ్గర చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు. దీంతో, సంక్షేమ పథకాలతో పాటుగా రీజియన్ల వారీగా అభివృద్ధి ప్రణాళికలను ప్రకటించేలా కసరత్తు కొనసాగుతోంది. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామనేది ఎన్నికల ప్రచారంలో ప్రధాన నినాదంగా రెండు పార్టీలు ప్రచారం చేయనున్నాయి.

హామీలపై కసరత్తు : 2014లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని జగన్ పదే పదే ప్రచారం చేస్తుండటంతో ఈ సారి పక్కాగా ఎన్నికల ప్రణాళిక సిద్దం చేయాలని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు. హామీలు ఇవ్వటంతో పాటుగా వాటి అమలుకు ఉన్న వెసులుబాటు...ఆర్దిక స్థితి గతులు..క్యాలెండర్ తో సహా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు.
ఈ సమావేశంలో చర్చకు వచ్చే ప్రతిపాదనలు..నిర్ణయాలను ఇరు పార్టీల అధినేతలకు వివరించి తుది నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెలాఖరులోగా పొత్తులు, పోటీ చేసే స్థానాల పైన స్పష్టతకు రావాలని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు. బీజేపీతో పొత్తుకు డిసైడ్ అయిన వేళ..ఆ పార్టీ నిర్ణయాలను పరిగణలోకి తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications