సాయిరెడ్డిపై కేసు పెట్టకపోతే కోర్టుకెళ్తా
Vijayasai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్దా వెంకన్న ఫిర్యాదు చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కలిసి లిఖితపూరకంగా ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
అనంతరం బుద్ధా వెంకన్న విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు జైలులో వేస్తామని సాయిరెడ్డి హెచ్చరించారని గుర్తు చేశారు. కాకినాడ పోర్టును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలవంతంగా లాక్కున్నారనేది వాస్తవం అని అన్నారు. 2019-2024 మధ్యకాలంలో వైసీపీ నాయకులు చేసిన దాడులు, దారుణాలు అన్నీ ఇన్నీ కావంటూ ఆరోపించారు.

జగన్ హయాంలో ఎన్నో బాధలు పడిన చాలామంది ఇప్పుడు పోలీసులు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేస్తోన్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే వారికి ఊరట లభించిందని బుద్ధా వెంకన్న అన్నారు. కేవీ రావు కూడా ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే వైసీపీ నాయకులు ఆయనకు కులాన్ని అంటగట్టారని మండిపడ్డారు.
కాకినాడ పోర్ట్ వ్యవహారంలో జగన్ తప్పు చేయలేదని, బలవంతంగా లాక్కోలేదని విజయసాయిరెడ్డి నిరూపించగలరా? అంటూ ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే.. కులం పేరుతో ఎదురుదాడికి దిగుతున్నారని, చంద్రబాబుకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తోన్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత చంద్రబాబును లోపలేస్తామని, చంపుతామని సాయిరెడ్డి వార్నింగ్ ఇస్తున్నారని, అలాంటి వాళ్లను ఎంతమాత్రం కూడా ఉపేక్షించకూడదని బుద్ధా వెంకన్న అన్నారు. ఆయపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కారణంతోనే తాను విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కలిశానని చెప్పారు.
చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు పోలీసులు తక్షణమే విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. లేకపోతే తాను న్యాయస్థానానికి వెళ్లి పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు. ఇకపై ఏది మాట్లాడినా విజయసాయిరెడ్డికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications