అచ్చెన్నాయుడు స్ధానంలో లోకేష్ ? ఫలితాల వేళ బుద్దా వెంకన్న సంచలనం..!
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ఫలితాలపై అన్ని పార్టీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే క్రమంలో ఈసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న విపక్ష టీడీపీ.. మరో అడుగు ముందుకేసి ఆ తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చకు తెరలేపుతోంది. ఇందులో భాగంగా పార్టీకి విధేయుడిగా ఉన్న సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా చెప్పాలంటే అధిష్టానం ముందు సంచలన డిమాండ్ పెట్టారు.

ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ఆ తర్వాత పార్టీ జరగాల్సిన మార్పులపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఇవాళ సంచలన డిమాండ్లను అధిష్టానం ముందు పెట్టారు. టీడీపీ అధికారం చేపట్టగానే ప్రస్తుత ఏపీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని కేబినెట్ లోకి తీసుకోవాలని, ఆయన స్ధానంలో టీడీపీ ఛీఫ్ గా నారా లోకేష్ కు బాధ్యతలు అప్పగించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన చెప్పుకొచ్చారు.
చంద్రబాబు అమరావతిలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే నారా లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని బుద్దా వెంకన్న కోరారు. ఇప్పటివరకూ సమర్ధంగా పనిచేసిన అచ్చెన్నాయుడు కేబినెట్ లో ఉంటారని, లోకేష్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని ఆయన కోరారు. తండ్రి సీఎంగా, కొడుకు పార్టీ ఛీఫ్ గా ఒకేరోజు బాధ్యతలు చేపట్టాలన్నారు. పార్టీ కోసం లోకేష్ 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశారన్నారు. టీడీపీ కూటమి 130కి పైగా సీట్లలో గెలుస్తుందన్నారు.
చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి నలుగురూ పార్టీ గెలుపు కోసం నాలుగు దిక్కుల్లా పనిచేశారన్నారు. టీడీపీని కాపాడే శక్తి నారా లోకేష్ కు ఉందన్నారు. టికెట్లు ఇవ్వకపోయినా చంద్రబాబు కుటుంబానికి తాను విధేయుడిగా ఉన్నానని, కాబట్టి లోకేష్ కు పగ్గాలు అప్పగించాలని కోరే హక్కు తనకు ఉందన్నారు. అచ్చెన్నాయుడు లాగే తాను కూడా బీసీయేనని బుద్ధా వెంకన్న గుర్తుచేశారు. లోకేష్ ను కూడా పార్టీ పగ్గాలు చేపట్టాలని బుద్ధా కోరారు.












Click it and Unblock the Notifications