చంద్రబాబుకు మాటిచ్చా, అందుకే - కేశినేనిపై బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు..!!
టీడీపీలో ఇప్పుడు కేశినేని వ్యవహారం కలకలం రేపుతోంది. సొంత పార్టీ నేతలను ఉద్దేశించి కేశినేని చేస్తున్న వ్యాఖ్యల పైన పార్టీ నాయకత్వం స్పందించలేదు. కేశినేని పార్టీ వీడేందుకు నిర్ణయించే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారా అనే ప్రచారం మొదలైంది. సొంత పార్టీ ఇంఛార్జ్ లను గొట్టాంగాళ్లు అంటూ నాని చేసిన వ్యాఖ్యలపైన పార్టీ ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కేశినేని నాని వ్యాఖ్యలు వైసీపీకి అనుకూలంగా మరుతున్నాయనే అభిప్రాయం ఉంది. ఇదే సమయంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు.
టీడీపీ రాజకీయం :
విజయవాడలో టీడీపీ రాజకీయం వివాదం అవుతోంది. ఎంపీ కేశినేని నాని తన పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ ఇంఛార్జ్ ల తీరు పైన గుర్రుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కేశినేని నాని పోటీ చేయరనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తనకు పొమ్మనకుండా పొగ పెడుతున్నారని..

మరింత మండితే ఆఫర్ల పైన నిర్ణయం తీసుకుంటానని కేశినేని స్పష్టం చేసారు. నందిగామ, మైలవరం వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనటం.. నిధులు మంజూరు చేయటం అక్కడి టీడీపీ ఇంఛార్జ్ లకు రుచించటం లేదు. దీని పైన ఇప్పటికే పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కేశినేని వ్యవహారం పైన మాత్రం టీడీపీ నాయకత్వం వేచి చూసే ధోరణితో ఉంది. ఇప్పటి వరకు నాని సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నా ఎక్కడా స్పందించటం లేదు.
కేశినేని డిసైడ్ అయ్యారా:పార్టీ మహానాడుకు తనకు ఆహ్వానం లేదని కేశినేని చెబుతున్నారు. పార్టీలో బుద్దా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమా వంటి వారి తీరు పైన కేశినేని నాని ఆగ్రహంగా ఉన్నారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాలతో వారి పైన ఈ రకంగా పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
దీని పైన బుద్దా వెంకన్న స్పందించారు. తనను ఎవరేం విమర్శించినా తొందరపడనిని చంద్రబాబుకు మాటిచ్చానన్నారు. కాబట్టే కేశినేని నాని వ్యాఖ్యలపై ఇప్పుడేం స్పందించబోనన్నారు. తన మాటలు పార్టీకి నష్టం చేకూర్చకూడదనే తాను మాట్లాడటం లేదన్నారు. కేశినేని నాని వ్యాఖ్యలను అధిష్ఠానం చూసుకుంటుందని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యల పైన అప్పుడే వివరణ ఇచ్చానని గుర్తు చేసారు.
పార్టీ నిర్ణయం ఏంటి:ఉమ్మడి కృష్ణా జిల్లాపైన ఈ సారి టీడీపీ భారీ ఆశలు పెట్టుకుంది. విజయవాడ పార్లమెంట్ టీడీపీకి కంచుకోటగా ఉంది. ఇప్పుడు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కేశినేని తీరుతో పార్టీలో ఏం జరుగుతుందనే డైలమా మొదలైంది. పనులు చేసిన ఎంపీగా కేశినేనికి గుర్తింపు ఉంది.
ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ప్రజలు కోరుకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తా.. మండితే వేరే పార్టీల ఆఫర్లు పరిశీలిస్తానని చెప్పటం ద్వారా టీడీపీలో కేశినేని కంఫర్ట్ గా ఉన్నట్లు కనిపించటం లేదు. ఇదే సమయంలో వైసీపీ కేశినేనినికి ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. తాజా పరిణామాలతో కేశినేని వ్యవహారంలో టీడీపీలో రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications