టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పుష్పరాజ్ కన్నుమూత: చంద్రబాబు దిగ్భ్రాంతి
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ గురువారం కన్నుమూశారు. ఏడాది క్రితం కరోనా వైరస్ బారినపడిన ఆయన.. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ.. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కుటుంబసభ్యులు ఇటీవలే గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం పుష్పరాజ్ కన్నుమూశారు. గత డిసెంబర్ నెలలో పుష్పరాజ్ ఇంటికి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
తెలుగుదేశం పార్టీలో పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న పుష్పరాజ్ 1983, 1985, 1999లో తాడికొండ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు పుష్పరాజ్. ఏపీ ఆహార కమిషన్ ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వహించారు.

కాగా, పుష్పరాజ్ మృతి పట్ల చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేత, ఆత్మీయులు జేఆర్ పుష్ఫరాజు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. నాకు అత్యంత ఆప్తులైన నేతలలో ఆయన ఒకరు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా, ఏపీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా దళిత, నిరుపేద ప్రజలకు పుష్పరాజు చేసిన సేవలు చిరస్మరణీయమని చంద్రబాబు కొనియడారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన పుష్పరాజు ప్రతి సందర్భంలోనూ పార్టీకి నిజాయితీగా సేవలందించారు.ఆయన మృతి పార్టీకి తీరని లోటు.పుష్పరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ...వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications