వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత - జగన్ కీలక హామీ..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి గా మారుతుంది. ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసేందుకు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో వైసీపీలో చేరికలు పెరుగుతున్నాయి. టిడిపి, జనసేన నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర రాయలసీమలో ముగింపు దశకు చేరుకుంది. తిరుపతి పార్లమెంటు పరిధిలో కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించే వేళ పార్టీలో కీలక చేరికలు మొదలయ్యాయి.
మారుతున్న లెక్కలు
నెల్లూరులో కొంతకాలంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, వైసీపీ నుంచి ముఖ్య నేతలు టిడిపిలోకి చేరికతో ఇప్పుడు ఎన్నికలు అక్కడ ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ సమయంలో టిడిపి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు వైసిపి నాయకత్వం ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే, టిడిపి కీలక నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తన మద్దతుదారులతో కలిసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కావలి నియోజకవర్గం నుంచి 2019 లో ఆయన పోటీ చేశారు.

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఆయనకు హామీ దక్కింది. నెల్లూరు జిల్లాలో ఈసారి పోరు హోరాహోరీగా మారుతోంది. వైసిపి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా.. ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలో చేరారు.
వైసీపీలో చేరికలు
ప్రస్తుతం ఆయన టిడిపి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో వైసిపి నుంచి రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిని నెల్లూరు బరిలో దింపారు. కొద్దిరోజులుగా ఆయన ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ తన యాత్ర ప్రారంభిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో ఎంపీ తో సహా 10 అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలిచింది. వైసీపీకి తొలినుంచి కంచు కోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ఈసారి తిరిగి ఆధిపత్యం నిరూపించుకోవాలనేది జగన్ లక్ష్యం.
అందులో భాగంగా రేపు బస్సు యాత్రకు విరామం ఇచ్చారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిస్థితిని స్వయంగా సమీక్షించనున్నారు. ఈ సమయంలోనే మరికొన్ని చేరికలు ఉంటాయని సమాచారం. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ప్రచార శైలి, కూటమి పార్టీల వ్యూహాలు, సొంత పార్టీలో తీసుకోవలసిన చర్యల పైన జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
నెల్లూరులో జగన్ స్కెచ్
వైసీపీ నుంచి టిడిపిలోకి చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆత్మకూర్ నుంచి ఆనం బరిలో ఉన్నారు. దీంతో ప్రతి సీటు గెలుపు జగన్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. విజయ్ సాయి రెడ్డి బరిలో ఉండటంతో జిల్లాలోని టిడిపి నేతలకు గాలం వేస్తున్నారు.
జగన్ నెల్లూరు జిల్లా పర్యటన పూర్తయ్యేలోగా మరి కొంత మంది ముఖ్యులను పార్టీలో చేరేలాగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలో చేరటంతో కావలి ప్రాంతంలో మరింత బలం పెరిగిందని పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో జగన్ పర్యటన సమయంలో నెల్లూరు రాజకీయం ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications