వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి - గోదావరిలో కొత్త లెక్కలు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. సీఎం జగన్ రేపు (శనివారం) తమ అభ్యర్దుల జాబితా ఇడుపులపాయ లో ప్రకటించనున్నారు. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. టీడీపీలో అభ్యర్దుల ప్రకటన వేళ సీట్లు రాని సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు. గోదావరి జిల్లాలో లెక్కలు మారుతున్నాయి. టీడీపీ మాజీ మంత్రి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.
సీట్ల నిరాకరణతో : పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రాబు బీజేపీ - జనసేనకు కేటాయించిన సీట్లు మినహాయించి 144 స్థానాల్లో పోటీకి సిద్దమయ్యారు. అందులో భాగంగా తొలి జాబితాలో 94 మంది, రెండో జాబితాలో 34 మంది పేర్లతో జాబితా విడుదల చేసారు. సీట్లు దక్కని సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో జనసేనాని పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే పిఠాపురంలో టీడీపీ ఇంఛార్జ్ వర్మ మద్దతు దారులు ఆందోళనకు దిగారు. అదే విధంగా పెనమలూరు టీడీపీ ఇంచార్జ్ బోడే ప్రసాద్ కు సీటు దక్కలేదు. దీంతో, ఆయన నిరాశకు గురయ్యారు. తాను టీడీపీలోనే ఉంటానని.. ఎన్నికల్లో మాత్రం పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో, బోడే ప్రసాద్ పార్టీ అధినేతతో భేటీ కానున్నారు.

గోదావరిలో కొత్త లెక్కలు : ఇక, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు స్థానం టీడీపీ ఈ సారి ముప్పిడి వెంకటేశ్వరరావును అభ్యర్దిగా ప్రకటించారు. దీంతొ, అక్కడ సీటు పైన ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి జవహర్ నిరుత్సాహానికి గురయ్యారు. తన అనుచర వర్గంతో సమావేశమయ్యారు. పార్టీలో దళితులకు ప్రాధాన్యత లేదని వాపోయారు. 2014లో జవహర్ 12,745 ఓట్ల మెజార్టీతో తానేటి వనిత పైన విజయం సాధించారు. ఇక్కడ నుంచి గెలిచిన జవహర్ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పని చేసారు. 2019 ఎన్నికల్లో జవహర్ తిరువూరు నుంచి పోటీ చేసారు. అక్కడ వైసీపీ అభ్యర్ది రక్షణనిధి చేతిలో ఓడిపోయారు. ఇక, ఈ సారి సీటు రాకపోవటంతో తనకు అన్యాయం చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో, వైసీపీ నేతలు టచ్ లోకి వెళ్లారు.

వైసీపీలోకి జవహర్ : విజయవాడ ఎంపీ కేశినేని నానితో జవహర్ భేటీ ఆయ్యారు. వైసీపీలో చేరికపై నానీతో చర్చించారు. దీంతో..జవహర్ వైసీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. తన అనుచర వర్గంతో సమావేశం నిర్వహించి అధికారికం గా నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఇప్పటికే జవహర్ స్పష్టం చేసారు. ఇప్పటికే వైసీపీ నుంచి అభ్యర్ది ఖరారు కావటంతో..పార్టీ అధికారంలోకి వస్తే సముచిత ప్రాధాన్యత ఇస్తామని వైసీపీ నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో చేరికల పైన వైసీపీ ఫోకస్ చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో గోదావరి జిల్లాల్లో పార్టీల మధ్య రాజకీయం హోరా హోరీగా మారుతోంది.












Click it and Unblock the Notifications