బీజేపీకి అనపర్తి సీటు కేటాయింపు వెనుక వైసీపీ..!?
ఏపీలో బీజేపీ పోటీ చేసే సీట్లు..అభ్యర్దులు ఖరారయ్యారు. టీడీపీకి కేటాయించిన అనపర్తి స్థానం ఇప్పుడు బీజేపీకి ఇవ్వటం పైన టీడీపీ స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనపర్తి నుంచి టీడీపీ తమ అభ్యర్దిగా నల్లమిల్లి రామక్రిష్ణారెడ్డి పేరు ప్రకటించింది. ఆ సీటును ఇప్పుడు బీజేపీకి ఇవ్వటంతో ఆయన తన అనుచరవర్గంతో సమావేశమయ్యారు. వైసీపీ - బీజేపీ కుట్రలో భాగంగానే తన సీటు బీజేపీకి వెళ్లిందంటూ ఆరోపించారు.
కీలక పరిణామాలు
ఏపీలో ఎన్నికల రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో భాగంగా మూడు పార్టీల సీట్లు సర్దబాటు పూర్తయింది. బీజేపీ తమ పార్టీ నుంచి పోటీ చేసే పది మంది అభ్యర్దుల జాబితా ప్రకటించింది. బీజేపీ సీట్ల వ్యవహారం ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతోంది. తూర్పుగోదావరిలో బీజేపీకి పొత్తులో భాగంగా అనపర్తి సీటు కేటాయించారు. ఈ సీటును తొలుత టీడీపీ తీసుకుంది. అక్కడ నుంచి తమ అభ్యర్దిని రామకృష్ణారెడ్డి ప్రకటించింది. రామకృష్ణారెడ్డి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డితో రాజకీయంగా పోరాటం చేసారు. పలు సందర్భాల్లో ఇద్దరు నేతల మధ్య సవాళ్లు చోటు చేసుకున్నాయి.

అనపర్తి లో ఆందోళన
ఈ సారి ఎలాగైనా నియోకవర్గంలో గెలిచేందుకు రామకృష్ణారెడ్డి వ్యూహాలు సిద్దం చేసుకున్నారు. ప్రచారం ప్రారంభించిన తరువాత ఇప్పుడు ఈ సీటును బీజేపీ నేత శివ క్రిష్ణంరాజుకు ఖరారైంది. తనకు సీటు, కేటాయించి తిరిగి బీజేపీకి ఇవ్వటం పైన రామకృష్ణారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. అనుచరులతో సమావేవమయ్యారు. నల్లమిల్లి మద్దతు దారులు చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పార్టీ ఎన్నికల సామాగ్రి ని దహనం చేసారు. సీటు మార్పు పైన రామక్రిష్ణారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతీ గ్రామంలో పాదయాత్రకు సిద్దమయ్యారు. తన మద్దతు దారుల నుంచి అభిప్రాయ సేకరణ చేసి వారి సూచన మేరకు తన నిర్ణయం ఉంటుందని రామక్రిష్ణారెడ్డి స్పష్టం చేసారు.

వైసీపీ చేసిన కుట్రగా ఆరోపణ
ఇదే సమయంలో రామక్రిష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ చేసిన కుట్రలో భాగంగానే బీజేపీకి సీటు కేటాయించారని ఆరోపించారు. రాజమండ్రి పార్లమెంట్ స్థానం బీజేపీకి కేటాయించటంతో ఆ సమీకరణాల్లో భాగంగా ఈ సీటు మార్పు జరిగిందనే ప్రచారం మొదలైంది. టీడీపీని వీడి స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసేందుకు రామకృష్ణారెడ్డి ని అనుచరవర్గం కోరుతోంది. అయితే, రామకృష్ణారెడ్డి పోటీ పైన తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. నియోజకవర్గంలో అందరి సూచనలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. దీంతో, అనపర్తి రాజకయం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications