Nara Lokesh : ఏపీకి భారీగా పెట్టుబడులు రాబోతున్నాయి.. ! పాదయాత్రలో నారా లోకేష్..
ఏపీలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ యువనేత నారా లోకేష్.. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడుల రాక విషయంలో కీలక ప్రకటన చేశారు.
ఏపీలో యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ యువనేత నారా లోకేష్.. తాజాగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. కర్నాటక సరిహద్దుల్లో ఉన్న ఈ జిల్లాకు చెందిన పలువురు వ్యాపారులు గత కొన్నేళ్లుగా రాష్ట్రాన్ని వదిలిపెట్టి బెంగళూరు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరిలో ఇవాళ లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఎస్ ఆర్ పురం హనుమాన్ టెంపుల్ విడిది కేంద్రం వద్ద బెంగుళూరులో స్థిరపడిన గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి చెందిన వ్యాపారస్తులతో ఇవాళ నారా లోకేష్ భేటీ అయ్యారు.సైకో పోయి, సైకిల్ వచ్చిన వెంటనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయంటూ వారితో నారా లోకేష్ వ్యాఖ్యానించారు. పెట్టుబడులు పెట్టడానికి అంతా సిద్దంగా ఉన్నారని, బెదిరింపులు, వేధింపులు లేని సైకిల్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారన్నారు.

ఉన్న వనరుల ఆధారంగాఏ జిల్లాకు ఏ పరిశ్రమలు అవసరమో తమ దగ్గర పక్కా ప్రణాళిక ఉందని లోకేష్ తెలిపారు. స్థానిక అవసరాలకు తగట్టుగా పరిశ్రమలు తీసుకొచ్చి స్థానిక యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించడమే టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించామని, టీడీపీ అధకారంలో ఉన్నప్పుడు పారిశ్రామికాభివృద్ధి లో ఏపీ నంబర్ 1గా ఉందని లోకేష్ తెలిపారు. జగన్ పాలనలో జే ట్యాక్స్, బెదిరింపుల దెబ్బకి అందరూ ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారన్నారు..
ఒక్క అమరరాజా సంస్ధ వెళ్లిపోవడం వలన దాదాపు 20వేల మంది రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో రాయలసీమను ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్ హబ్ గా తయారు చేశామని లోకేష్ గుర్తుచేశారు. విశాఖకు ఐటి కంపెనీలు తీసుకొచ్చామని, అన్ని జిల్లాల్లో మైక్రో క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ దెబ్బకి రాష్ట్రంలో అన్ని రంగాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయన్నారు. చిన్న,మధ్య తరగతి పరిశ్రమలను జగన్ నాశనం చేశాడన్నారు. అందుకే టీడీపీ అధికారంలోకి రాగానే రీబిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామన్నారు. పరిశ్రమలు, వ్యాపారాలు చేసే వారికి టీడీపీ పాలనలో ఎటువంటి వేధింపులు లేకుండా అన్ని అనుమతులు లభిస్తాయని, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు సమయానికి సబ్సిడీలు అందిస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications