మిస్టర్ జగన్ రెడ్డీ: మీకు అర్థమౌతోందా?: సంస్కారంపై మీ నుంచి పాఠాలు నేర్చుకోవాలా?: పట్టాభి
గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించి..కేసులను ఎదుర్కొన్న ఆయన తొలుత అరెస్ట్ అయ్యారు. జైలుకు వెళ్లారు. ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల అయ్యారు. ఆ వెంటనే మాల్దీవులకు బయలుదేరి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించకపోవడం పట్ల జగన్ సర్కార్‌పై ఘాటు విమర్శలు గుప్పించారు.

అత్యధికంగా రేట్లు పెంచింది..
దేశంలోనే అత్యధికంగా పెంచిన రాష్ట్రం ఏపీనేనని, ఈ ఏడాది కాలంలో పెట్రోల్‌పై రూ.7.59 పైసలు, డీజిల్‌పై రూ.5.48 పైసలు పెంచిందని పట్టాభి అన్నారు. ఈ విషయాన్ని పెట్రోలియం శాఖ మంత్రి స్వయంగా పార్లమెంట్‌లో ప్రకటించారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో జగన్ సర్కార్ ప్రజలపై అనేక రకాలైన భారాలను మోపిందని విమర్శించారు. ఏదీ కొనలేని, ఏదీ తినలేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని, దీనికి కారణం వైసీపీ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు.

ప్రతినెలా వెయ్యి కోట్లు..
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై విధించిన వ్యాట్, అమ్మకం పన్నుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా 1,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని, ఆ మొత్తం అంతా ప్రజల నుంచి పిండుకుంటోందని పట్టాభిరామ్ మండిపడ్డారు. డీజిల్ మీద అత్యధికంగా రూ.29.30 పైసలు, పెట్రోల్‌పై రూ.21.50 పైసలను ప్రభుత్వం అదనంగా వసూలు చేస్తోందని ఆరోపించారు. ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో పెట్రోల్, డీజిల్ ద్వారా 78 వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి అందిందని, దాన్ని ఏం చేస్తోన్నారని పట్టాభిరామ్ ప్రశ్నించారు.

నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతుంటా..
ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయడంలో, నిజాలను నిర్భయంగా మాట్లాడటంలో తాను వెనక్కి తగ్గబోనని పట్టాభి అన్నారు. ప్రజలకు వాస్తవాలను వివరించి తీరుతానని చెప్పారు. ఆధారాలతో సహా వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలను తాము ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉంటామని పట్టాభి పేర్కొన్నారు. అదనపు భారాలను ప్రజలపై మోపుతూ ఎంతోకాలం పరిపాలన సాగించలేరని అన్నారు.

రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, వ్యాట్‌ను తగ్గించకపోవడం వంటి అంశాల గురించి ప్రజలకు వివరిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చామని పట్టాభి అన్నారు. దీన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రంలోని అన్ని బంకుల వద్ద ధర్నాలను నిర్వహిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించినప్పటికీ.. రాష్ట్రం ఎందుకు వ్యాట్‌ను తగ్గించట్లేదని ప్రశ్నించారు.

క్రమశిక్షణ గల పసుపు సైనికుడిని..
తాను క్రమశిక్షణ గల పసుపు సైనికుడినని పట్టాభి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఎన్ని దాడులు చేసినా, భయపడబోనని అన్నారు. పసుపు సైనికుల పేరు చెబితే ప్రభుత్వమే వణుకుతోందని ఎద్దేవా చేశారు. సంస్కారం గురించిన పాఠాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి లేదని అన్నారు. తాను వందల ప్రెస్ మీట్లలో మాట్లాడానని ఏనాడూ నోరు జారలేదని అన్నారు. తనకు ఉన్న దమ్ము, ధైర్యం ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని పట్టాభి చెప్పారు.












Click it and Unblock the Notifications