జగన్ చేత.. జగన్ కొరకు..!!
విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానుల ఉద్యమం ఊపందుకుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటయ్యాయి. పలువురు ప్రజా ప్రతినిధులు, మేధావులు, విద్యావేత్త, సామాజికవేత్తలు ఇందులో పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రానికి మూడు రాజధానుల అవసరం ఉందనే విషయాన్ని తేల్చి చెప్పారు. ప్రాంతీయ అసమానతలు తలెత్తకుండా ఉండటానికి మూడు రాజధానులను నెలకొల్పాల్సి ఉంటుందనీ స్పష్టం చేశారు.

నాన్ పొలిటికల్ జేఏసీ
మూడు రాజధానులను ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలనీ డిమాండ్ చేస్తోన్నారు. దీనికోసం ఐక్యకార్యాచరణ కమిటీ సైతం ఏర్పాటైంది. రాజకీయేతర జేఏసీలో విద్యా, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ లజపతి రాయ్ దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తోన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకుడు దేముడు కో కన్వీనర్‌గా ఉన్నారు.

15న విశాఖ గర్జన..
విశాఖపట్నాన్ని వెంటనే కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించలనే డిమాండ్‌తో ఈ నెల 15వ తేదీన విశాఖ గర్జన ఆందోళనను చేపట్టనుంది ఈ జేఏసీ. అధికార వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని, దీనికి మద్దతుగా ఈ ఆందోళనను నిర్వహించనున్నట్లు తెలిపింది. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా బదలాయించడానికి తాము స్వాగతిస్తోన్నామని, దీన్ని వెంటనే చేపట్టాలని స్పష్టం చేసింది. విశాఖలోని ఎల్‌ఐసీ కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద 15వ తేదీ ఉదయం 10 ర్యాలీ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది.

వంగలపూడి అనిత విమర్శలు..
ఈ విశాఖ గర్జనను నిర్వహించ తలపెట్టిన జేఏసీపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు కరణం ధర్మశ్రీ చేసిన రాజీనామాను ఓ డ్రామాగా అభివర్ణించారు. నాన్ పొలిటికల్ జేఏసీపైనా ఘాటు విమర్శలు గుప్పించారు. జేఏసీ ఏర్పాటు కూడా ఓ డ్రామాగా ఆరోపించారు. జేఏసీకి కొత్త అర్థాన్ని ఇచ్చారామె. జేఏసీ అంటే జగన్ చేత, జగన్ కొరకు, జగనే నడుపుతున్న కమిటీ అని చెప్పారు.

కన్వీనర్‌గా జగన్ మనిషి..
జేఏసీ కన్వీనర్‌గా వ్యవహరిస్తోన్న లజపతి రాయ్‌ను వంగలపూడి అనిత విమర్శించారు. ఆయన జగన్ మనిషేనని చెప్పారు. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఈ సమావేశాలు, రాజీనామాలన్నీ ఓ డ్రామా అని అన్నారు. ఈ మేరకు అనిత ఓ ట్వీట్ చేశారు. గతంలో లజపతి రాయ్ పోస్ట్ చేసిన కొన్ని ట్వీట్లను వాటికి జత చేశారు.












Click it and Unblock the Notifications