చంద్రబాబు- రేవంత్ మరో భేటీ?
Chandrababu Naidu- Revanth Reddy meeting: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రత్యేకించి విభజన సమస్యల పరిష్కారం, నదీ జలాల పంపిణీ, ఏపీలోని పోర్టులు, టీటీడీలో తెలంగాణకు వాటాపై చర్చించారు.
ఏపీ విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయినా విభజన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావట్లేదని, దీనిపై రెండు వైపుల నుంచి అత్యున్నత స్థాయి కమిటీలు వేయాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల అధ్యక్షతన ఈ కమిటీలు రెండు వారాల్లోగా మనుగడలోకి వస్తాయి. మరో ముగ్గురు చొప్పున అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు.

అప్పటికీ విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి అవసరమైన మార్గాలు కనిపించకపోతే రెండు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ వేసి పరిష్కరించాలని నిర్ణయించారు. మాదక ద్రవ్యాలు, గంజాయికి వ్యతిరేకంగా రెండు రాష్ట్రాలు సంయుక్తంగా యాంటీ నార్కొటిక్స్ డ్రైవ్స్ నిర్వహించాలని ఉమ్మడిగా తీర్మానించారు. సైబర్ క్రైమ్‌ను అరికట్టడానికీ ఈ రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటాయి.
చంద్రబాబు- రేవంత్ రెడ్డి భేటీపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పొలిట్ బ్యురో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. ఈ సమావేశాన్ని స్వాగతించారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోవడానికి ఇదొక చక్కని వేదికగా అభివర్ణించారు.
10 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని అంశాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి సారించడం శుభపరిణామమని అన్నారు. ఇలా చొరవ తీసుకోవడం మంచి నిర్ణయం అని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంపూర్ణంగా హర్షం వ్యక్తం చేస్తోన్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు.
మరోసారి ఇలాంటి భేటీ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని వర్ల రామయ్య అన్నారు. ఒక్క సమావేశంతోనే సమస్యలనేవి పరిష్కారానికి నోచుకోబోవని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే మరోసారి ముఖ్యమంత్రులు ఇద్దరూ ముఖాముఖి సమావేశమైతే కథ సుఖాంతమౌతుందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications