శేఖర్ రెడ్డితో తెలుగు తమ్ముళ్లకు సంబంధాలు: వైసిపి నేత కన్నబాబు
వంద కోట్లకు పైగా నగదు, కిలోల కొద్ది బంగారంతో ఐటి అధికారులకు చిక్కిన శేఖర్ రెడ్డికి టిడిపి ముఖ్య నేతలతో సంబంధాలున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కన్నబాబు విమర్శించారు.
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డితో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలకు సంబంధాలున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపించారు శేఖర్ రెడ్డి ఆర్థిక వ్యవహారాలపై ఐటి శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆయన కోరారు తమిళనాడులో శేఖర్ రెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించి, ఐటి అధికారులు పెద్ద యెత్తున నగదును బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
గిరిజన సంక్షేమంపై చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజన సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.
గిరిజన సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితుల పునరావాసానికి ఏ విధమైన చర్యలు తీసుకున్నారో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా విలీన మండలాల్లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని అన్నారు.

కాళ్లవాపు బాధితులు, నవజాత శిశు మరణాలు వంటి సమస్యలున్నాయని ఆయన చెప్పారు. రంపచోడవరం, చింతూరుల్లో మరుగుదొడ్లులేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి తాను జగన్‌తో చర్చించినట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యుడదు విజయసాయి రెడ్డి ఎంపి నిధులతో తక్షణమే మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంట్లు నిర్మించాలని జగన్ ఆదేశించినట్లు తెలిపారు. త్వరలోనే ఆ ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు.
వంద కోట్లకు పైగా నగదు, కిలోల కొద్ది బంగారంతో ఐటి అధికారులకు చిక్కిన శేఖర్ రెడ్డికి టిడిపి ముఖ్య నేతలతో సంబంధాలున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు కన్నబాబు విమర్శించారు.












Click it and Unblock the Notifications