టీడీపీ నేతల నిరసనలు, దీక్షలు - చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేతలు నిరసనలకు దిగారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ ధర్నాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరు పైన మండి పడుతున్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు ప్రమేయం లేదని నినదిస్తున్నారు. అటు చంద్రబాబు బెయిల్ పిటీషన్లను కోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. నారా లోకేశ్ ఢిల్లీలో ఉన్నారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్ట్ పై మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు ఆందోళన కొనసాగుతోంది. విజయవాడ నగరంలో చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు సమాధానం చెబుతారని పార్టీ నేతలు హెచ్చరించారు. పార్టీ నేతలు కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వైసీపీ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు.

ముందు చూపు, దూర దృష్టి తో ఉమ్మడి ఎపిని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. నోటీసు ఇవ్వకుండా అర్ద్రరాత్రి చంద్రబాబును ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పై నమోదు చేసిన సెక్షన్లు ఆయనకు వర్తించవని న్యాయవాదులు చెబుతున్నారని వివరించారు. చంద్రబాబు కు మద్దతుగా ఎపితో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లో నిరసనలు జరుగుతున్నాయని కేశినేని చిన్ని చెప్పుకొచ్చారు.

లోకేశ్ ఢిల్లీలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ గురించి వివరిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు బయటకు వచ్చే వరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమా గారి కార్యాలయం వైసిపి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరికలు చోటు చేసుకున్నాయి.

వారిని పార్టీ నేతలు ఆహ్వానించారు. గుడివాడలో టీడీపీ నేత వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. చంద్రబాబును జైల్లోనే ఉంచాలనే రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతుందని రాము మండిపడ్డారు. రాజ్యాంగంపై తమకు నమ్మకం ఉందని,న్యాయం గెలుస్తుందని చెప్పుకొచ్చారు. తామంతా చంద్రబాబు వెంట ఉంటామనే సందేశాన్ని తెలుగు ప్రజలు బలంగా మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు.
విజయవాడలో విద్యార్ధుల నిరసనలకు సిద్దమవుతున్నారని కాలేజీలను మూసివేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగాయి. నారా భవనేశ్వరి ని జైలులో చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించగా అధికారులు అనుమతి నిరాకరించారు. ఇందుకు గల కారణాలను అధికారులు వెల్లడించారు. ఇక, వైసీపీ నుంచి టీడీపీకి దగ్గరైన మాజీ మంత్రి ఆనం తీవ్రంగా స్పందించారు. ఏపీ ప్రభత్వానికి మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇక, ఈ నెల 19న కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటీషన్ పైన..విచారణ, నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications