కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు: టీడీపీ సైలెన్స్: పెదవి విప్పొద్దంటూ ఆదేశాలు?: వైసీపీకి మైలేజ్
అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పుడున్న వాటికి అదనంగా మరో 13 జిల్లాలు వచ్చి చేరనున్నాయి. మొత్తంగా 26 జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలు తెర మీదికి రానున్నాయి.
Recommended Video

కొన్నింటికి కొత్త పేర్లు..
కొత్తగా ఆవిర్భవించబోతోన్న 13 జిల్లాల్లో కొన్నింటికి.. వాటికి ఉన్న ప్రాధాన్యత ఆధారంగా పేర్లు పెట్టడాన్ని కూడా పూర్తి చేసింది జగన్ సర్కార్. రాయచోటి కేంద్రంగా ఆవిర్భవించనున్న జిల్లాకు తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య పేరును పెట్టింది. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పడబోయే జిల్లాకు శ్రీ సత్యసాయిగా నామకరణం చేసింది. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తూ దానికి శ్రీవారి పేరును పెట్టింది. శ్రీబాలాజీ జిల్లాగా పిలవనుంది.

కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు..
పార్వతిపురం కేంద్రంగా మన్యం జిల్లాను తెరమీదికి తీసుకుని రానుంది. పాడేరు జిల్లాకు విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును పెట్టింది. అమలాపురం కేంద్రంగా ఏర్పాటు కానున్న కొత్త జిల్లాకు కోనసీమ పేరును పెట్టింది ప్రభుత్వం. నరసరావుపేట జిల్లాకు పల్నాడు పేరును పెట్టింది. కొత్తగా మనుగడలోకి రానున్న విజయవాడ జిల్లాకు- తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరును పెట్టింది.

హామీ అమలు..
ఎన్టీఆర్ పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తామంటూ వైఎస్ జగన్.. తన పాదయాత్ర సమయంలోనే హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేశారు. విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమం, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణాజిల్లాను కొనసాగించనుంది ప్రభుత్వం. గన్నవరం, గుడివాడ, పెనుమలూరు, పెడన, పామర్రు, అవనిగడ్డ, మచిలీపట్నం నియోజకవర్గాలు ఈ జిల్లా పరిధిలో ఉంటాయి.

స్పందించని టీడీపీ..
కాగా- విజయవాడ జిల్లాకు తమ పార్టీ వ్యవస్థాపకుడి పేరు పెట్టడం పట్ల తెలుగుదేశం నాయకులు స్పందించట్లేదు. మౌనంగా ఉంటోన్నారు. ప్రభుత్వాన్ని అభినందించడం గానీ, కృతజ్ఞతలు తెలపడం గానీ చేయట్లేదు. ఈ విషయం మీద ఇప్పటిదాకా కీలక నాయకులెవరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయట్లేదు. పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గానీ, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ గానీ, రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు గానీ స్పందించలేదు.

పొలిటికల్ మైలేజీ వైసీపీకే..
చరిత్రలో నిలిచిపోొయే విధంగా స్వయానా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి పేరును విజయవాడ జిల్లాకు పెట్టినప్పటికీ టీడీపీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో ఎవ్వరు కూడా పెదవి విప్పొద్దంటూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి క్యాడర్‌కు సందేశం వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిమీద ఎలాంటి అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు చేసినా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ మైలేజీని ఇచ్చినట్టవుతుందని టీడీపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

నిమ్మకూరు విజయవాడ పరిధిలో రాకున్నా..
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంపై కమ్మ సామాజిక వర్గానికి గట్టి పట్టు ఉంది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనంలోనూ ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకుంది. అటు ఎన్టీ రామారావు జన్మస్థలం నిమ్మకూరు.. విజయవాడ పరిధిలో ఉండదు. నిమ్మకూరు ఉన్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం కృష్ణా జిల్లా పరిధిలోకి వెళ్తుంది. అయినప్పటికీ- విజయవాడ పార్లమెంటరీ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే విషయంలో వైఎస్ఆర్సీపీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టే.

నిత్యం పూజించే ఎన్టీఆర్ పేరు పెట్టినా..
ఎన్టీ రామారావు విగ్రహానికి దండ వేసి, దండం పెట్టనిదే తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయంగా ఏ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించరు. అలాంటిది ఆయన పేరును ఓ జిల్లాకు పెట్టినా స్పందించకపోవడం.. టీడీపీ అనుసరిస్తోన్న వ్యూహాత్మక మౌనానికి నిదర్శనమని అంటున్నారు. పద్మ అవార్డులను అందుకున్న వారికి అభినందనలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మొదలుకుని పలువురు నాయకులు, మాజీ మంత్రులు పోస్టులు పెట్టినా- కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పట్ల మాత్రం స్పందించడానికి నిరాకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications