కూటమిలో చేరికల చిచ్చు - పవన్ నిర్ణయం వెనుక..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి చేరికల సంఖ్య పెరుగుతోంది. తొలుత టీడీపీలోకి వైసీపీ నేతలు చేరేందుకు మొగ్గు చూపారు. అయితే, తమ సొంత నియోజకవర్గంలో పరిస్థితులకు అనుగుణంగా మూడు పార్టీల్లో ఎందులో చేరాలనేది నేతలు నిర్ణ యించుకుంటున్నారు. తాజాగా బీజేపీ, జనసేనలో చేరికలు టీడీపీ నేతలకు రుచించటం లేదు. తమను ఇబ్బంది పెట్టిన వారిని కూటమిలో ఎలా చేర్చుకుంటారని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నా రు. అయితే, పవన్ మాత్రం పక్కా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు స్పష్టం అవుతోంది.
కూటమిలో వార్
వైసీపీ పరాజయంతో ఆ పార్టీ ముఖ్య నేతలు వరుసగా కూటమి పార్టీల్లో చేరుతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. అదే విధంగా బాలినేని, సామినేని వంటి వారు జనసేనలో చేరారు. బాలినేని జనసేన లో చేరిక పైన ఒంగోలు టీడీపీ నేతలు ఇప్పటికీ రాజీ పడటం లేదు. స్థానికంగా టీడీపీ నేతలు ఎవరూ బాలినేనితో కలిసి పని చేసేందుకు సిద్దంగా లేరు. అదే విధంగా ఏలూరులో ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. కానీ, స్థానికంగా వచ్చిన అభ్యంతరాలు చర్చగా మారాయి. కూటమిలో ఏ పార్టీకి అభ్యంతరం లేకపోతేనే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని గతంలో జరిగిన సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయించారు.

చేరికల చిచ్చు
బీజేపీలో వైసీపీ నేత విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్‌ను బీజేపీలో చేర్చుకున్న వ్యవహారం కూటమి పార్టీల మధ్య చిచ్చు కు కారణమైంది. స్పీకర్ అయ్యన్న నేరుగా చంద్రబాబుకు ఫిర్యాదు చేసారు. అదే విధంగా తాజాగా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నేతలు ఇప్పుడు జనసేనలో చేరారు. గంజి చిరంజీవి ని పవన్ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. తొలుత టీడీపీలో ఉన్న చిరంజీవి ఆ తరువాత వైసీపీలో చేరి లోకేష్‌పై ఇష్టానుసారంగా మాట్లాడారు. లోకేశ్‌పై పోటీకి సిద్దమైన గంజి చిరంజీవిని జనసేనలో చేర్చుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, స్థానికంగా జనసేన ముఖ్య నేతల సిఫార్సుతో పవన్ పార్టీలో చేర్చుకున్నారు.
పవన్ తాజా వ్యూహాలు
అదే విధంగా.. కైకలూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తాజాగా జనసేనలో చేరారు. ఈ పరిణామం కైకలూరు టీడీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. కానీ, వచ్చే ఎన్నికల నాటికి పవన్ తన పార్టీకి బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా పార్టీలో చేరికల పైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కూటమిగానే ఉంటూ మూడు పార్టీలు తమ బలం పెంచుకు నే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, వీటిని ప్రశ్నించే పరిస్థితులు కనిపించటం లేదు. కానీ, ఈ చేరికలతో ప్రధానంగా ఆ నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు మాత్రం ఆగ్రహంతో కనిపిస్తున్నారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు ఈ చేరికల పైన ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications