విజయవాడలో సంచలనం..వైసీపీ నేత శిరోముండనం
రాష్ట్రంలో టీడీపీ నేతల దాడులు ఇంకా కొనాసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లలో విజయం సాధించి కూటమి అధికారంలోకి వచ్చింది. అధికార పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే గెలుచుకుని ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. ఇక రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు అధికం అయ్యాయి. వైసీపీ సానుభూతిపరులపై టీడీపీ నాయకులు దాడులు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.
దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాలపై కూడా దాడులు చేయడం జరిగింది. ఇక మంగళగిరిలో వైసీపీ నాయకుడుపై దాడి చేయడమే కాకుండా అతన్ని మోకాళ్లపై నిలబెట్టి లోకేష్ ఫొటోకు క్షమాపణలు చెప్పిన ఘటన బయటకు వచ్చింది. తాజాగా విజయవాడలో ఓ వైసీపీ నేత ఇంటిని కూల్చివేసిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ నాయకుడు నందేపు జగదీష్‌కు సంబంధించిన ఇంటిని ఆదివారం మునిసిపల్ అధికారులు కూల్చి వేశారు.

బుల్ డోజర్లతో అతని ఇంటితో పాటు వ్యాపార సముదాయాన్ని నేలమట్టం చేశారు. దీనిపై స్పందించిన జగదీష్ ఈ ఘటన వెనుక టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ఉన్నాడని ఆరోపిస్తూ.. జగదీష్ తన కుటుంబంతో సహా నిరసన వ్యక్తం చేశారు. కుట్ర, కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ సందర్భంగా ప్రకాశ్‌నగర్‌లోని తన ఇంటి ముందే కూర్చుని శిరోముండనం చేయించుకుని నిరసన తెలిపారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు కూడా పక్కనే ఉన్నారు.జగదీష్ మాట్లాడుతూ.. బోండా ఉమా దాదాగిరి ఎక్కువైందని మండిపడ్డారు.
తన భవనాన్ని జేసీబీల సాయంతో పగలకొట్టించారని అన్నారు. గతంలో తాను టీడీపీలో ఉన్నప్పుడు ఈ భవనం ప్రారంభోత్సవం అప్పటి ఎమ్మెల్యే బోండా ఉమానే చేశారని గుర్తు చేశారు. అలాంటి భవనం ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఉందా? అని జగదీష్ నిలదీశారు. అధికారం ఈరోజు టీడీపీది కావొచ్చు.. రేపు వైసీపీది కావొచ్చు.. కానీ, ఇలా కక్ష పూరిత రాజకీయాలు సింగ్‌నగర్ సహా విజయవాడలో దశాబ్దకాలంలో లేవన్నారు. మరి ఈ ఘటనపై టీడీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications