టీడీపీ కేడర్ ను టెన్షన్ పెడుతున్న చంద్రబాబు, అచ్చెన్న...!!
ఏపీలో అధికారం దక్కేదెవరికి. హోరా హోరీగా సాగిన ఎన్నిక సమరంలో ఫలితం పైన అదే ఉత్కంఠ కొనసాగుతోంది. కూటమి, వైసీపీ గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఐప్యాక్ టీం తో తాము 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్పుకొచ్చారు. అటు టీడీపీ మద్దతు దారులు తమదే విజయం అని ప్రచారం చేస్తున్నారు. సర్వే సంస్థలు తమ లెక్కల్లో బిజీగా ఉన్నాయి. ఈ సమయంలోనే టీడీపీ కేడర్ ను చంద్రబాబు, అచ్చెన్నాయుడు టెన్షన్ పెడుతున్నారు.
జగన్ ప్రకటనతో
ఈ నెల 13న పోలింగ్ జరిగింది. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. పెరిగిన రెండు శాతం పోలింగ్ తమకే అనుకూలిస్తుందని టీడీపీ కూటమి లెక్కలు వేస్తోంది. పెద్ద ఎత్తున జరిగిన మహిళా ఓటింగ్..గ్రామీణ ఓటర్లు తమ వైపే నిలిచారని వైసీపీ చెబుతోంది. ముఖ్యమంత్రి జగన్ పోలింగ్ తరువాత ఐ ప్యాక్ సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 4న దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. 2019 లో సాధించిన 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్ల కంటే ఎక్కువ సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు. గత అయిదేళ్ల కంటే మెరుగైన పాలన అందిస్తామని చెప్పారు. జగన్ నేరుగా తమ విజయం గురించి చెప్పటంతో వైసీపీ ఇతర నేతలు సైతం తమ గెలుపు ఖాయమని చెబుతున్నారు.

నాయకత్వం మౌనం వెనుక
టీడీపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పోలింగ్ పూర్తయిన తరువాత ఇప్పటి వరకు పార్టీ అధినాయకత్వం స్పందించలేదు. గెలుపు పైన ఎలాంటి ప్రకటన చేయలేదు. సాధారణంగా ఏ ఎన్నిక జరిగినా చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తారు. వారణాసిలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రమే చంద్రబాబు ఏపీలో ఎన్డీఏ గెలుస్తుందని చెప్పారు.2019 ఎన్నికల పోలింగ్ తరువాత అదే విధంగా తమ గెలుపు ఖాయమని చెప్పుకొచ్చారు. తాజా ఎన్నికల తరహాలోనే నాడు మహిళలు రాత్ర వరకు పోలింగ్ కేంద్రాల్లోలైన్లలో నిలబడి ఓటింగ్ చేసారు. ప్రభుత్వానికి అనుకూలంగా పోలైన ఓట్లుగా నాడు చంద్రబాబు చెప్పుకొచ్చారు.
కేడర్ లో ఉత్కంఠ
కానీ, ఇప్పుడు చంద్రబాబు పోలింగ్ తరువాత ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పార్టీలో ఇప్పుడు ఈ వ్యవహారం చర్చగా మారింది.చంద్రబాబు,లోకేష్ విదేశాల్లో ఉన్నారు. పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు సైతం తమ గెలుపు ఖాయమంటూ ఒక్క సారి మీడియా ముందుకు రాలేదు. ఇతర అంశాల పైన స్పందిస్తున్నఅచ్చెన్నాయుడు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తూ ప్రకటన చేయకపోవటం ఏంటనే చర్చ పార్టీలో జరుగుతోంది. పోలింగ్ తరువాత మూడు పార్టీలు కలిసి గెలుపు పైన ఉమ్మడి ప్రకటన చేయాల్సి ఉన్నా...చేయకపోవటం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో..అసలు ఏం జరుగుతుందనే ఉత్కంఠ పార్టీ కేడర్ లో పెరిగిపోతోంది.












Click it and Unblock the Notifications