చంద్రబాబుకు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి: వాట్ నెక్స్ట్
అమరావతి: వచ్చే ఏడాది ఏపీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం. రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో దూసుకెళ్తోందా పార్టీ. ఇంకో తొమ్మిది నెలల్లో ఎన్నికలను ఎదుర్కొనాల్సిన ఈ దశలోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోవడం.. ప్రాధాన్యతను సంతరించుకుంది.
అదే సమయంలో- ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీరు మాత్రం దిగజారుతోందనడానికి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. రాజమండ్రిలో ఈ ఏడాది మేలో నిర్వహించిన మహానాడు సందర్భంగా పాక్షికంగా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో మొదలుకుని.. పుంగనూరు ఉదంతం వరకూ అన్నీ వైఫల్యాలే కనిపిస్తోన్నాయి.

మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీడీపీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించట్లేదు. పైగా అవన్నీ బెడిసికొట్టాయి కూడా. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోను చంద్రబాబు కాపీ కొట్టారనేది బహిరంగ రహస్యమే. ఈ విషయంలో వైఎస్ జగన్ సైతం స్వయంగా టీడీపీ మేనిఫెస్టోను గతంలో ట్రోల్ చేశారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రకటించిన విధంగా.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, బీజేపీ హామీ ఇచ్చిన ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, ఇక సాక్షాత్తూ వైఎస్ఆర్సీపీ నవరత్నాల్లో భాగమైన అమ్మఒడిని సైతం చంద్రబాబు తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి అమలు చేస్తోన్న మిషన్ భగీరథను కూడా వదల్లేదాయన. ఇంటింటికీ మంచినీరు అనే కాన్సెప్ట్ అక్కడిదే.

ఎన్నికలు ఇంకా ఏడాది సమయం ఉందనగానే హడావుడీగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం బూమరాంగ్ అయింది. దాన్ని జనంలోకి తీసుకెళ్లడంలోనూ పార్టీ క్యాడర్ ఘోరంగా విఫలమైంది. కర్ణాటక కాంగ్రెస్ ఇచ్చిన హామీలేననే విషయాన్ని సామాన్య ప్రజలు సైతం అర్థం చేసుకోవడం వల్లే.. దానికి ఆదరణ లభించలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.
మేనిఫెస్టోను ప్రచారం చేయడానికి టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా 26 బస్సులతో యాత్ర చేసినా ఏ మాత్రం స్పందన కనిపించలేదంటే.. అది ఏ స్థాయిలో విఫలమైందో అర్థం చేసుకోవచ్చు. సొంత పార్టీ నాయకులు కూడా టీడీపీ మేనిఫెస్టోను ప్రచారం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతో చంద్రబాబు రాత్రికి రాత్రి మేనిఫెస్టోను ప్రకటించారని టీడీపీ వర్గాలే తేల్చి చెబుతున్నాయి.

ఈ హామీల నుంచి ఏ మాత్రం వెనక్కి వెళ్లలేని పరిస్థితిని కొని తెచ్చుకున్నారు చంద్రబాబు. జనాదరణ పొందలేకపోయినప్పటికీ ఈ ఆరు హామీల్లో ఏ ఒక్కదాన్ని తొలగించినా, లేక అందులో మార్పులు చేర్పులకు ప్రయత్నించినా.. కొరివితో తలగోక్కున్నట్టవుతుందాయనకు. రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రాన్ని అందించినట్టవుతుంది.
ఫలితంగా ఆయన పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అటు యువగళం పాదయాత్రపైనా పలు అనుమానాలు వ్యక్తమౌతోన్న విషయం తెలిసిందే. నారా లోకేష్.. పెద్దగా ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నారని, అందుకే చంద్రబాబు ప్రాజెక్టుల పేరుతో యాత్రను చేపట్టారని వైసీపీ నేతలు తేల్చేస్తున్నారు.












Click it and Unblock the Notifications