కుప్పంలో ఓ స్కూల్‌ను బాగుచేసుకోలేకపోయావ్..: బొత్స సెటైర్స్
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. మహానాడులో ప్రకటించిన ఎన్నికల తొలి విడత మేనిఫెస్టోపై విమర్శలు మొదలయ్యాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగారు. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న నవరత్నాలపై గతంలో చంద్రబాబు చేసిన విమర్శలను గుర్తు చేస్తోన్నారు. ఆల్ ఫ్రీ చంద్రబాబు అంటూ సెటైర్లు సంధిస్తోన్నారు.
మహానాడు వేదికపై నుంచి చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే మహాశక్తి, యువగళం, ఇంటింటికీ మంచినీరు, పూర్ టు రిచ్, అన్నదాత, బీసీలకు రక్షణ చట్టం.. పేర్లతో కొత్త పథకాలను ప్రవేశపెడతానంటూ మహానాడు వేదికగా ప్రకటించారు. తల్లికి వందనం పేరుతో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలను తల్లుల అకౌంట్‌లో జమ చేస్తానని, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరినీ ఉచితంగా చదివిస్తానని హామీ ఇచ్చారు.

మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తానని, దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తానని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు చంద్రబాబు.
చంద్రబాబు ఇచ్చిన ఈ హామీలపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఎదురుదాడి చేస్తోన్నారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు కనీస సదుపాయాలను కల్పించలేకపోయాడని, అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇన్ని హామీలను ఇస్తోన్నాడంటే హాస్యాస్పదంగా ఉందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
అప్పుడు పేదవాళ్లను ధనవంతులుగా చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదంటూ చంద్రబాబును నిలదీశారాయాన. కనీసం కుప్పంలో ప్రభుత్వ పాఠశాలను బాగు చేయలేకపోయావంటూ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత నాడు-నేడు కింద కుప్పం సహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునికంగా తీర్చిదిద్దామని బొత్స చెప్పారు.
రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, వారిని లక్షాధికారులను చేసిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని వ్యాఖ్యానించారు. ఈ నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఒక్క విద్యా రంగంపైనే 60,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని పేర్కొన్నారు. పాఠశాలల్లో చదువుకునే పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందిస్తోన్నామని అన్నారు.












Click it and Unblock the Notifications