జగన్ చిచ్చు: కొల్లు, ‘చేప పిల్లల్లా విలవిల్లాడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు’
విజయవాడ: రాష్ట్ర అభివృద్ధిని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినే వైయస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని రాష్ట్ర మంత్రి పీతల సుజాత ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సాక్షి మీడియాలో ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భూభకాసురుల గురించి రాయాలని డిమాండ్ చేశారు.
ఆ తర్వాత తమ గురించి మాట్లాడాలని ఆమె హితవు పలికారు. అసెంబ్లీ నుంచి ఏడాది సస్పెండైనా ఎమ్మెల్యే రోజాకు ఇంకా బుద్ధి రాలేదని సుజాత ఎద్దేవాచేశారు. రోజా ప్రభుత్వంపై అవాకులు, చివాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎండిపోయిన చెరువులో చేపపిల్లల్లాగ వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విలవిల్లాడుతున్నారని మంత్రి సుజాత అన్నారు.
జగన్ చిచ్చుపెడుతున్నాడు: కొల్లు రవీంద్ర
రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ జగన్మోహన్ రెడ్డి చిచ్చుపెడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తునిలో దుండగులను పంపి రైలును తగులబెట్టించారని విమర్శించారు. లక్షలాది ఎకరాలను ఆక్రమించి నీతులు చెబుతున్నారని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

మాజీ మంత్రి, కాపు ఉద్యత నేత ముద్రగడ పద్మనాభం లేఖపైనా ఆయన స్పందించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో గురువారం మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
టీడీపీని మరింత బలోపేతం చేస్తాం: కళా వెంకటరావు
రాష్ట్రంలో టీడీపీ మరింత బలోపేతమవుతోందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్‌రెడ్డి విధివిధానాలు నచ్చక ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంచెలంచెలుగా టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. దీనికి తోడు సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై.. తమ పార్టీలో చేరేందుకు పలువురు ముందుకు వస్తున్నారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని వెంకటరావు జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications