Tdp Mla Resignation : రాజీనామాకు సిద్దమైన టీడీపీ ఎమ్మెల్యే ?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు తర్వాత మారిన పరిణామాల్లో వచ్చే ఎన్నికలకు వ్యూహాలు సిద్దం చేసుకునే పనిలో పార్టీలు, నేతలు బిజీగా కనిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ ఎమ్మెల్యే ఒకరు రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీ టీడీపీతో పాటు ఇతర పార్టీల్లోనూ చర్చనీయాంశమవుతున్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే.. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తాజాగా స్ధానిక రైతుల సమస్యలను తీర్చడంలో విఫలమైందంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు పచ్చని పంటలతో సస్యశ్యామలంగా ఉండే కృష్ణా డెల్టా ప్రాంతం వైసీపీ పాలనలో ఎడారిని తలపిస్తోందన్నారు. వ్యవసాయానికి నీరే ప్రాణాధారమని, అలాంటి నీటిని అందించలేని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. కృష్ణా నదీ జలాల నిర్వహరణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.

ప్రభుత్వ చేతకానితనం వల్ల పంట పొలాలకు నీరు అందక రేపల్లె నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అనగాని ఆరోపించారు. నీళ్లు లేక నిజాపట్నం, రేపల్లె, నగరంపాలెం మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు వేసిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. కళ్ల ముందే పంట ఎండిపోవటంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని, మరో వైపు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించలేకపోతోందని విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కృష్టా జలాలు విడుదల చేసి డెల్టా ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే కోరారు. రైతుల కోసం ఏ త్యాగానికైనా తాను సిద్దమని, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడనన్నారు. ఎమ్మెల్యే పదవి తనకు నియోజకవర్గ ప్రజలు పెట్టిన బిక్షని, వారి కంటే తనకు ఏ పదవి ఎక్కువ కాదన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని, లేకుంటే నాగలిని శిలువగా మోస్తూ రైతుల పక్షాన పోరాటానికి శ్రీకారం చుట్టి తక్షణమే పదవికి రాజీనామా చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications